Margadarsi Case: మొన్నటిదాకా “మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే” ఈ ట్యాగ్ లైన్ ను ఈనాడు బహు ముచ్చటగా ప్రచురించేది. ఈటీవీ అద్భుతంగా ప్రసారం చేసేది. అంతేకాదు తన సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కూడా చిట్టీలు కట్టించేది. చిట్టీలు కట్టిస్తే బోనస్ కూడా ఇచ్చేది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చిట్టీలు వేసేందుకు పెద్దగా జనం రావడం లేదు. ఉన్నవారు ఎప్పుడు పాడుదామా అని చూస్తున్నారు. అటు చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరింత ఉరుముతున్నాడు. అసలు ఏపీలో మార్గదర్శి అనే సంస్థ ఉండేందుకే వీల్లేదు అనే తీరుగా వ్యవహరిస్తున్నాడు. అంటే దీని తెరవెనుక కారణాలు ఏమైనప్పటికీ.. మార్గదర్శలో అవకతవకులు జరుగుతున్నాయి అనేది సుస్పష్టం. ఏపీ సిఐడి అధికారుల తనిఖీల్లో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయనేది అనేది నిజం. మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి నాడు మార్గదర్శి పరిస్థితి ఏమిటి? రామోజీరావు ఆర్థిక మూల స్తంభం భవిష్యత్తు ఏమిటి?
ఏపీ సిఐడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మార్గదర్శి ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అధికారులు సోదాలు చేస్తున్న 37 శాఖల బ్యాంకు ఖాతాల్లో వాటి చందా దారుల నిధులు లేవని వెల్లడైంది. అంటే చందాదారులు చెల్లించిన డబ్బులు మొత్తం ప్రధాన కార్యాలయానికి వెళ్లిపోయాయని ఏపీ సిఐడి అధికారులు అంటున్నారు.. ఆ నిధులు ప్రధాన కార్యాలయం బ్యాంకు ఖాతాలో ఉన్నాయా? అంటే అక్కడా కూడా లేవని ఏపీ సిఐడి అధికారులు చెబుతున్నారు. ” ఆ నిధులను గుట్టు చప్పుడు కాకుండా రామోజీరావు సొంత వ్యాపార సంస్థల్లో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా మళ్లించేశారు.. ఫలితంగా రాష్ట్రంలోని 37 మార్గదర్శి శాఖల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఆ శాఖల చందాదారులు చిట్టి పాటలు పాడిన సొమ్మును చెల్లించే స్థితిలో సంస్థ లేదన్న విషయం తేటతెల్లమైంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పరిస్థితే అని కూడా స్పష్టమైంది. కొత్తగా చిట్టి వేసే చందాకారులు చెల్లించే చందా మొత్తంలో పాత చిట్టిల చందాదారులు పాడిన ప్రైజ్ మనీ చెల్లిస్తూ ఇన్నాళ్లు సంస్థ కనికట్టు ప్రదర్శించిందని” ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
కేంద్ర చిట్ ఫండ్ చట్టం_1982 ను కచ్చితంగా పాటించాలి అని ఏపీ చిట్స్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ గత ఏడాది డిసెంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు వేయడం లేదు. అంటే 9 నెలలుగా వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొత్త చిట్టీలు, కొత్త చందాదారులు, కొత్తగా చందా మొత్తాలు రాక డిసెంబర్ ముందు మొదలుపెట్టిన వేలాది చందాదారులకు చిట్టి పాట ప్రైజ్ మని చెల్లించడం మార్గదర్శి చిట్ ఫండ్స్ కు తలకు మించిన భారంగా పరిణమించిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరో వైపు చందాదారులకు చిట్టి పాట మొత్తం చెల్లించకుండా వాటిని ఇతర మార్గాలకు మళ్లిస్తున్నదని ఏపీ సిఐడి వర్గాలు అంటున్నాయి. కాలపరిమితి దాటిన డిపాజిట్లను నిబంధనల ప్రకారం చందాదారులకు తిరిగి చెల్లించాలి. దీనికి కూడా మార్గదర్శి వద్ద నిధులు లేవు. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైజ్ మనీ, డిపాజిట్ల చెల్లింపు సందేహంగా మారింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అగ్రిగోల్డ్ సంస్థ మూసివేతకు ముందు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొందో.. మార్గదర్శి కూడా ప్రస్తుతం అటువంటి దుస్థితిలో ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మార్గదర్శి సంస్థ భవిష్యత్తులో కూడా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఏ క్షణాన్నయినా బోర్డు తిప్పేసే అవకాశం ఉందని, దీనివల్ల చందాదారులు, డిపాజిట్ దారులు నిండా మునిగిపోయే ప్రమాదం ఉందని ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, సిఐడి అధికారుల సోదాల్లో బయటపడిందని తెలుస్తోంది.