Telugu States Film And Politicians Celebrities: ఒక్క కేసుకు సంబంధించి తీగ లాగితే మొత్తం డొంక బయటపడుతోంది. ఎక్కడో ఢిల్లీలో వెలుగుచూసిన మద్యం కేసు మూలాలు తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డాయి. కొందరు ప్రముఖులకు సైతం సంబంధాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంబంధాలున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కేసు ఒక్కటే అయినా.. దీని వెనుక పదుల సంఖ్యలో బినామీ సంస్థలు వెలుగుచూస్తున్నాయి. వాటితో ప్రముఖులకు సంబంధాలుండడంతో ఈడీ పట్టుబిగుస్తోంది. నేరుగా మద్యం కేసుతో వీరికి సంబంధం లేకపోయినా..ఇతరత్రా వ్యాపార కార్యకలాపాలు, అనధికార పెట్టుబడులు, నల్ల ధనాన్ని చట్టబద్దం చేసే ప్రయత్నాలకు సంబంధించి విలువైన సమాచారం ఈడీకి చిక్కినట్టు సమాచారం. మద్యం కేసు విచారణను ప్రారంభించిన ఈడీకి ఇతర ఆర్థికపరమైన నేరాలకు సంబంధించి వివరాలు పట్టుబడ్డాయి. దీంతో ఈడీ అధికారులకు చేతినిండా పని దొరికింది.
ఢిల్లీ మద్యం ముడుపుల కేసుకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ముమ్మరంగా సోదాలు చేస్తోంది. ఇప్పటికే మూడు సార్లు సోదాలను పూర్తిచేసింది. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన రామచంద్ర పిళ్లైను సీబీఐ నిందితుడి చేర్చింది. ఆయనతో కలిసి వ్యాపారాలు చేస్తున్నవారిపై అటు సీబీఐ, ఇటు ఈడీ దర్యాప్తు ప్రారంభించాయి. తొలుత రామచంద్ర పిళ్లై ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. తరువాత ఆయన భాగస్వాములైన బోయినపల్లి అభిషేక్, సురేష్ గండ్ర తదితరుల కార్యకలాపాలపై దృష్టిపెట్టాయి. అయితే ఇంతటితో సీబీఐ, ఈడీ దర్యాప్తు ముగుస్తుందని అంతా భావించారు. ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. కానీ ఆ రెండు దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. కొన్ని కీలక వ్యవహారాలు గుర్తించడంతో దర్యాప్తును ముమ్మరం చేశాయి.
అయితే దాదాపు మద్యం ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆడిట్ నిర్వహణ ఓ సంస్థ చూస్తోంది. దీంతో ఈడీ, సీబీఐ అధికారులు సదరు ఆడిట్ సంస్థలో సోదాలు నిర్వహించగా ఎన్నో విషయాలు, అక్రమాలు బయటకు వచ్చాయి. పదుల సంఖ్యలో సంస్థలు, వందకు పైగా అనుమానిత ఖాతాలు బయటపడ్డాయి. ఆ ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యుడిగా వెన్నమనేని శ్రీనివాసరావును గుర్తించారు. ఆయనతో చాలామంది ప్రముఖులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఈడీ విచారణలో తేలింది. మరో రెండు సాఫ్ట్ వేర్ కంపెనీల పేర్లు సైతం బయటకు రావడంతో దర్యాప్తు సంస్థలు అక్కడ సోదాలు చేశాయి. అయితే వీరందరికీ నేరుగా మద్యం కేసుతో సంబంధం లేకపోయినా.. అనుమానాస్పద రీతిలో ఖాతాల నుంచి లావాదేవీలు జరిపినందున ఈడీ, సీబీఐలు వేర్వేరుగా దర్యాప్తు చేయనున్నాయి. మొత్తానికి మద్యం ముడుపుల కేసు వంద అనుమానాస్పద ఖాతాలను పట్టించినట్టయ్యింది.