https://oktelugu.com/

Rahul Gandhi: మళ్లీ తెరపైకి రిజర్వేషన్ల రద్దు అంశం.. కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ గాంధీ!

దేశంలో కొన్నేళ్లుగా రిజర్వేషన్ల రద్దు డిమాండ్‌ పెరుగుతోంది. రిజర్వేషన్ల కారణంగా ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందన్న వాదన ఉంది. ఈ క్రమంలో మోదీ సర్కార్‌ అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు కల్పించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 10, 2024 2:31 pm
    Rahul Gandhi(2)

    Rahul Gandhi(2)

    Follow us on

    Rahul Gandhi: దేశంలో రిజర్వేషన్ల రద్దు అంశం రాజకీయ ఎజెండాగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ విషయంపై విపక్ష ఇండియా కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయన్న అంశాన్ని జనంలోకి తీసుకెళ్లింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని బలంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంతో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి లబ్ధి పొందింది. కానీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్‌ ఒంటరిగా 99 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక ఇండియా కూటమి 235 సీట్లు సాధించింది. బీజేపీ ఒంటరిగానే 230 స్థానాలు గెలిచింది. ఎన్నికల అనంతరం రిజర్వేషన్ల రద్దు అంశం కనుమరుగైంది. అయితే తాజాగా దీనిని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మళ్లీ తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌.. రిజర్వేషన్ల రద్దు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    వరుస సమావేశాలు..
    మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన రాహుల్‌గాంధీ అక్కడ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో ఆయన రిజర్వేషన్ల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్టాత్మక జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. భారత్‌లో ప్రస్తుతం ఆదివాసీలు, దళితులు, ఓబీసీల రిజర్వేషన్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వారికి సరైన రిజర్వేషన్లు అందడం లేదని, ప్రాధాన్యత సైతం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధిలోనూ వారి భాగస్వామ్యం నామమాత్రమేనని చెప్పారు. దేశంలో అన్నివర్గాల వారికి పారదర్శకంగా అవకాశాలు దొరికినప్పుడే తాము రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామని చెప్పారు. కామన్‌ సివిల్‌ కోడ్‌ గురించి ప్రశ్నించగా.. దాని గురించి తాను ఇప్పుడే స్పందించే పరిస్థితి లేదన్నారు.

    ఎన్నికలనాటి పరిస్థితిపై..
    అంతకుముందు వర్జీనియాలో ప్రవాస భారతీయులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులపైనా మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌ బ్యాంక్‌ అకౌంట్లను ఐటీ శాఖ ఫ్రీజ్‌ చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల వేళ తమ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్‌ చేసి.. తమ నాయకులకు నిధులు ఇవ్వకుండా చేశారని పేర్కొన్నారు. దాని వల్ల కాంగ్రెస్‌ నేతలు ఒక్కసారిగా విశ్వాసం కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. కానీ వారిలో ధైర్యం నింపి ఎన్నికలకు వెళ్లినట్లు తెలిపారు. అలాగే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇప్పుడు బీజేపీని చూసి ఎవరూ భయపడడం లేదని, ఇప్పుడు తాను కూడా ప్రధాని ముందుకు వెళ్లి 56 అంగుళాల ఛాతి ఇక చరిత్రే అని చెప్పగలనంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా అమెరికాలో పర్యటనలో రాహుల్‌ రిజర్వేషన్ల రద్దుతోపాటు పలు అంశాలపై వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. రాహుల్‌ వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు.