Guntur YCP: వైసీపీకి గుంటూరు జిల్లా కొరకరాని కొయ్యగా మారింది. రాజధాని అంశం ప్రభావితం ఎక్కువగా ఉండడం, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం వంటి అంశాలతో అక్కడ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ మొండి చేయి చూపారు. విడదల రజనీకి స్థానచలనం కల్పించారు. తాజాగా పల్నాడు లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ పరిణామాల నడుమ అభ్యర్థుల ఎంపికలో జగన్ చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ సరైన అభ్యర్థులు దొరకకపోవడం వైసీపీకి ఆందోళన కలిగిస్తోంది.
యువ క్రికెటర్ అంబటి రాయుడు కొద్ది రోజుల కిందట వైసీపీలో చేరారు. అయితే చేరిన పది రోజులకే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయనకు గుంటూరు పార్లమెంటు స్థానం టికెట్ ఇస్తారని అంతా భావించారు. అదే హామీతో ఆయన పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే గుంటూరు నుంచి పోటీ చేయాలని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు జగన్ సూచించారు. అయితే తనకు టిక్కెట్ ఇస్తానని చెప్పి శ్రీకృష్ణదేవరాయలకు ఒప్పించడం ఏంటని అంబటి రాయుడు మదనపడ్డారు. ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. అటు శ్రీకృష్ణదేవరాయలు సైతం పార్టీని వీడారు. ఢిల్లీలో చంద్రబాబుతో చర్చలు జరిపారు. దీంతో ఆయన టిడిపిలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. దీంతో గుంటూరుకు కొత్త అభ్యర్థిని వెతుక్కోవలసిన పరిస్థితి జగన్ కు ఎదురైంది.
మంగళగిరి నియోజకవర్గంలో సైతం పరిస్థితి బాగాలేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని జగన్ తప్పించారు. నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను గంజి చిరంజీవికి అప్పగించారు. ఆయన పనితీరు బాగాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. అటు ఐప్యాక్ బృందం సైతం ఇదే విషయాన్ని తేల్చి చెబుతోంది. చిరంజీవి స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, ఎమ్మెల్సీ హనుమంతరావు కోడలు లావణ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు నేతలను జగన్ స్వయంగా పిలిపించుకొని మాట్లాడారు. దీంతో మంగళగిరిలో అభ్యర్థిని మార్చుతారని తెలుస్తోంది.
ప్రత్తిపాడులో సైతం అధికార పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక్కడ సమన్వయకర్తగా బాలసాని కిరణ్ కుమార్ ఉన్నారు. అయితే ఈయన స్థానికేతరుడు. ఈయన స్థానంలో స్థానికులకు కేటాయించాలని డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు రేపల్లెలో కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సమన్వయకర్తగా నియమితుడైన ఈ పూరి గణేష్ కు మోపిదేవి వెంకటరమణ సహకరించడం లేదని తెలుస్తోంది.
పొన్నూరులో సైతం పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కిలారి రోశయ్య ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వం ఇంతవరకు ఖరారు కాలేదు. గుంటూరు లోక్సభ స్థానానికి రోశయ్య బావమరిది ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు పరిశీలనలో ఉంది. దీంతో రోశయ్యను పెండింగ్లో పెట్టారు. అటు సత్తెనపల్లిలో సైతం అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఒక వర్గం బలంగా పనిచేస్తోంది. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ సైతం తిరుగుబాటుబావుట ఎగురవేస్తున్నారు. ఇలా ఏ నియోజకవర్గము చూసినా వైసీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.