
హుజురాబాద్ లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం బరితెగించి అడ్డదారులు తొక్కుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. వేల కోట్లు ఖర్చుచేస్తూ అబద్దాలతో గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈటల ప్రజాస్వామ్య పద్దతిలో గెలుస్తారని.. ఓట్లను అభ్యర్థించాలే కానీ కొనుక్కోకూడదన్నారు. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు.
పాదయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటలను పరామర్శించిన అనంతరం బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ పాదయాత్ర విజయవంతంగా సాగుతుందన్నారు. ప్రస్తుతం ఈటలకు లోబిపి, హై షుగర్ తో ఈటల బాధపడుతూ పాదయాత్ర చేస్తూ పడిపోయారన్నారు. అపోలో ఆస్పత్రిలో టెస్ట్ లు నిర్వహిస్తున్నారని.. టెస్టుల తర్వాత పాదయాత్ర కొనసాగిస్తాననే ధీమాతో ఈటల ఉన్నారన్నారు. పాదయాత్రతో ప్రజల దగ్గరకువెళ్లి ఆశీర్వాదం తీసుకోవాలనే దానికి ఈటల కట్టుబడి ఉన్నారన్నారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా పాదయాత్ర కొనసాగుతుందని.. ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. మూడు రోజులు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారని.. దయచేసి కార్యకర్తలు, అభిమానులు ఎవరు హాస్పిటల్ కి రావొద్దని సూచించారు. అనారోగ్య సమస్యలున్న నేపథ్యంలో పాదయాత్ర ఆపాలని విజ్ఞప్తి చేసామన్నారు.
ప్రస్తుతం ఈటల ఆరోగ్యంగా ఉన్నారని.. దళితులపై కేసీఆర్ కు నిజంగా ప్రేమ ఉంటే హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే రైతు బంధు లెక్క దళితబంధు ను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ పై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసి వేధిస్తున్నారన్నారు. ఉపఎన్నికల కోసమే దళితబంధు పెట్టినం అని సీఎం ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. సీఎంగా కొనసాగే నైతికహక్కు కేసీఆర్ కు లేదన్నారు.
దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ లోని దళిత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికలుంటేనే పథకాలు అమలుచేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఆరోగ్యం కుదుటపడగానే ఈటల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసిన హుజురాబాద్ ప్రజలు ఈటల వెంటే ఉంటారన్నారు. ఓటమి భయంతోనే సీఎం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు.