కరోనా కేసులు మళ్ళీ మెల్లగా పెరుగుతున్న నేపథ్యంలో ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితులో ఉన్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ముందు జాగ్రత్తలో భాగంగా రాత్రి కర్ఫ్యూని పొడిగించారు. పైగా తాజాగా ఈ కర్ఫ్యూని మరో రెండు వారాలు పొడిగించారు. అంటే.. ఇక థియేటర్ లో సెకండ్ షోలు లేనట్టే.
ఇప్పటికే తెలంగాణాలో 100 పెర్సెంట్ ఆక్యుపెన్సీతో అన్ని షోలకు అనుమతి లభించడంతో సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. అయితే, తెలుగు సినిమాలకు ప్రధాన మార్కెట్ ఏపీనే. కానీ ఏపీలో నెలకొన్న కరోనా పరిస్థితులు కారణంగా పెద్ద సినిమాలు ఇప్పట్లో థియేటర్లలో రిలీజ్ చెయ్యలేని పరిస్థితి కనిపిస్తోంది.
అయితే, ఆగస్టు నాలుగో వారం నుండి తమ సినిమాలను రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎలాగూ ఆగస్టు 15 నాటికి కరోనా కేసులు భారీగా పెరగకపోతే.. ఇపుడున్న ఆ ఆంక్షలను కూడా పూర్తిగా తీసేయాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. కర్ఫ్యూ లేకపోతే పెద్ద సినిమాలు రిలీజ్ కు క్యూ కడతాయి. ఈ లోపు ఎలాగూ చిన్నాచితకా సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే ఈ వీకెండ్ ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ వంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే వచ్చేవారం ‘ఎస్సార్ కల్యాణ మండపం’ వంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి. కానీ ఎప్పుడు రిలీజ్ అవుదామా అని ఎదురుచూస్తోన్న ‘లవ్ స్టోరీ’, ‘టక్ జగదీష్’ లాంటి మీడియమ్ రేంజ్ సినిమాల విడుదల తేదీ విషయాల్లోనే ఇంకా గందరగోళం నడుస్తోంది. దీనికితోడు మళ్ళీ లాక్డౌన్ పెట్టే పరిస్థితి వస్తే.. మళ్ళీ మొదటికి వస్తోంది వ్యవహారం.