https://oktelugu.com/

CM Jagan: బీసీల కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్న జగన్

రాష్ట్ర జనాభాలో బీసీలది సింహభాగం. ప్రస్తుతం బీసీ జాబితాలో 138 కులాలు ఉన్నాయి. అందులో 31 కులాలకు స్పష్టమైన భౌగోళిక పరిమితులు ఉన్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 14, 2023 / 11:30 AM IST

    CM Jagan

    Follow us on

    CM Jagan: వైసీపీ బీసీ మంత్రంతో ముందుకు సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో బీసీ నినాదమే గట్టెక్కిస్తుందని బలంగా నమ్ముతోంది. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బీసీ కులాలను రాష్ట్రవ్యాప్త జాబితాలోకి చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో రాజశేఖర్ రెడ్డి 42 కులాలను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేస్తూ బీసీల్లో చేర్చారు. రిజర్వేషన్ పెంచకుండా ఇలా చేర్చడమేంటని నాడు బీసీలు ప్రశ్నించారు. ఇప్పుడు అదే కులాలను రాష్ట్రస్థాయిలో బీసీలుగా పరిగణిస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడం విశేషం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీల్లో వైసీపీకి పట్టు పెరుగుతుందని నమ్ముతున్నారు. అదే సమయంలో కొన్ని బీసీ కులాల నుంచి అసంతృప్తి వ్యక్తం కావడం అధికార పార్టీకి కలవరపాటుకు గురిచేస్తుంది.

    రాష్ట్ర జనాభాలో బీసీలది సింహభాగం. ప్రస్తుతం బీసీ జాబితాలో 138 కులాలు ఉన్నాయి. అందులో 31 కులాలకు స్పష్టమైన భౌగోళిక పరిమితులు ఉన్నాయి. అందులో 10 కులాలు తెలంగాణలో ఉన్నాయి. మిగిలిన 21 కులాలను కోస్తా రాయలసీమలో బీసీలుగా పరిగణిస్తున్నారు. అయితే ఈ కులాలన్నింటినీ రాష్ట్రస్థాయి బీసీ జాబితాలో చేర్చాలని ఎప్పటి నుంచో వినతులు ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఒక్క శెట్టి బలిజలను మాత్రం రాయలసీమలో బీసీలుగా పరిగణించకూడదు అని ప్రభుత్వం నిర్ణయించింది.

    రాష్ట్రవ్యాప్తంగా బీసీఏ గ్రూపులో ఉన్న ఆరు కులాలతో పాటు ఉప కులాలకు సంబంధించి భౌగోళిక పరిమితులను రద్దు చేశారు. కురకుల, పొందర, సామంతుల, పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయని వారు, పాలెగారు, తొలకరి, కవలి, ఆసాదుల, కేవుట, అచ్చు కంట్ల వాండ్లు, గౌడ, కలాలి, గౌండ్ల, శెట్టి బలిజ( రాయలసీమకు మినహాయించి), కుంచిటి, ఒక్కలింగ, గుడ్ల, మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, మొదలర్, మొదలియార్, బేరి వైశ్య, అతిరాస, కుర్మి, కళింగ కోమట్ల కులాలకు సంబంధించి పరిమితులను రద్దు చేశారు. రాష్ట్రస్థాయి బీసీ జాబితాలో చేర్చారు.

    ప్రస్తుతం జగన్ సర్కార్ తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. వై నాట్ 175 అని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అంతర్గత సర్వేల్లో సైతం ఇదే తేలుతోంది. అందుకే గెలుపు కోసం చిన్న ప్రయత్నాన్ని సైతం జగన్ విడిచిపెట్టడం లేదు. అందులో భాగంగానే బీసీలను తన వైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందుకే నాడు తండ్రి రాజశేఖర్ రెడ్డి చేయని ప్రయత్నం తాజాగా చేసి చూపించారు. అయితే ఇది మేలు కంటే కీడు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జాబితాలో చోటు దక్కని వారు కచ్చితంగా వ్యతిరేకిస్తారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.