
Hyderabad: ఆమె బాలిక. కానీ పథకాలు రచించడంలో దిట్ట. కన్న తండ్రినే కడతేర్చాలని సినీ ఫక్కీలో కుట్ర చేసింది. చాటుగా జన్మనిచ్చిన వాడినే అంతమొందించింది. ప్రేమించిన వాడి సాయంతో హత్యకు పథకం వేసింది. అదే అదనుగా కోడి కూరలో విషం కలిపింది. తండ్రి నిద్రలోకి జారుకోవడంతో ప్రియుడితో కలిసిన గ్యాంగ్ రంగంలోకి దిగి అతడిని హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా కాలు జారి పడ్డాడని అబద్దం ఆడి ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. చివరికి పోస్టుమార్టమ్ నివేదిక రావడంతో వారి పన్నాగం బయట పడింది.
హైదరాబాద్(Hyderabad) లోని కుషాయిగూడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య జులైలో జరిగినా పోస్టుమార్టమ్ నివేదిక రావడానికి ఆలస్యం కావడంతో ఇన్నాళ్లు అది ప్రమాదంగానే భావించారు. దీనికి ప్రధాన కారణం ఓ బాలిక కావడం గమనార్హం. ఎట్టకేలకు నిందితులు కటాకటాలపాలయ్యారు.
కుషాయిగూడ ప్రాంతానికి చెందిన పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటున్నాడు. గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేసేవాడు. గత జులై 20న తలకు బలమైన గాయాలతో ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ మరణించాడు. ఇంట్లో జారిపడ్డాడని చెప్పడంతో ఎవరికి అనుమానం రాకపోవడంతో నిజం బయట పడలేదు.
రామకృష్ణ కింద పడి మరణించలేదని గొంతు నులిమి కొట్టడం వల్లే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఇందులో కఠినమైన నిజాలు తెలిశాయి. రామకృష్ణ గతంలో నారాయణగూడలోని ఓ అపార్ట్ మెంట్లో ఉంటున్నప్పుడు రామకృష్ణ కూతురు వాచ్ మెన్ కొడుకు చెట్టి భూపాల్(20)తో ప్రేమలో పడింది.
దీంతో రామకృష్ణ కూతురును మందలించాడు. ఓసారి రామకృష్ణ ఇంట్లోని రూ.1.75 లక్షలు చోరీ చేశాడు. దీనిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భూపాల్ పై కేసు నమోదైంది. అతడిని జైలుకు పంపారు. కూతురు నిర్వాకంతో పరువు పోతుందని భావించిన రామకృష్ణ ఇల్లు మారాడు. కానీ వారి ప్రేమ మాత్రం మారలేదు. జైలు నుంచి విడుదలైన భూపాల్ మళ్లీ ప్రేమాయణం కొనసాగించాడు. దీంతో బాలిక తన తండ్రిని అంతమొందించాలని పథకం పన్ని ప్రియుడు భూపాల్ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చింది. తండ్రిని హత్య చేసేందుకు పథకం పన్నింది. ఇందులో భాగంగానే రామకృష్ణను హత్య చేశారు. చివరికి కటాకటాలపాలయ్యారు.