Air India: నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది.. కానీ అందులో ఒక అబద్ధం ఉంటే చాలు.. ఎంత నష్టం తెస్తుందంటే.. ఎయిర్ ఇండియా సంస్థకు ఎదురైన అనుభవం అలాంటిది మరి..

నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. కానీ మాట్లాడే ఆ మాటల్లో ఒక్క అబద్ధం ఉంటే చాలు.. ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. నష్టాలు చోటుచేసుకుంటాయి. అలాంటి సంఘటన ఎయిర్ ఇండియా సంస్థకు అనుభవంలోకి వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 19, 2024 12:25 pm

Air India

Follow us on

Air India: ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన “బోయింగ్ 777″ అనే విమానం సోమవారం 130 టన్నుల జెట్ ఇంధనాన్ని నింపుకొని ప్రయాణికులతో బయలుదేరింది. ఆ విమానం న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. ముంబై నుంచి న్యూయార్క్ నగరానికి 16 గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రయాణించాల్సి ఉంది. కానీ, ఆ విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. అత్యవసరంగా ఢిల్లీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ” బోయింగ్ 777 విమానం ల్యాండింగ్ బరువును గరిష్టంగా 250 టన్నులను కలిగి ఉంటుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ లో ఉన్నప్పుడు ప్రయాణికులు, సామగ్రి తో కలిసి 340 – 350 టన్నుల వరకు బరువు ఉంటుంది. రెండు గంటల్లో ల్యాండింగ్ చేయడంతో దాదాపు 100 టన్నుల ఇంధనాన్ని అదనంగా డంప్ చేయాల్సి వచ్చింది. టన్నుకు దాదాపు ఒక లక్ష అదనంగా ఖర్చయింది.. ఈ ప్రకారం లెక్క వేసుకుంటే కోటి రూపాయల వరకు ఇంధనం వృధా అయ్యిందని” ఓ సీనియర్ పైలెట్ వెల్లడించారు. అనూహ్యంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఊహించని విధంగా ల్యాండింగ్ చేయడంతో.. ఎయిర్ ఇండియాకు అదనంగా ఖర్చయింది. ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలు, ఢిల్లీ హోటళ్లల్లో 200 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని ఉంచడం ఎయిర్ ఇండియాకు తడిసి మోపెడయింది. ఇదే సమయంలో విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్ల ఎయిర్ ఇండియాకు అదనపు ప్రయాస తప్పలేదు. పైగా షెడ్యూల్ చేసిన రిటర్న్ ఫ్లైట్ లో ప్రయాణికులను న్యూయార్క్ చేరవేయడం ఎయిర్ ఇండియా సంస్థకు ఇబ్బందికరంగా మారింది. ఆ బూటకపు బెదిరింపు వల్ల ఎయిర్ ఇండియాకు మూడు కోట్లకు పైగా అదనంగా ఖర్చయింది.

ఇదొక రక ఆర్థిక ఉగ్రవాదం

గత ఆదివారం నుంచి విమానాలకు బూటకపు బెదిరింపులు సర్వసాధారణంగా మారాయి. ఆదివారం నుంచి గురువారం వరకు సుమారు 40 విమానాలకు ఇలాంటి బూటకపు బెదిరింపులు వచ్చాయి. దీనివల్ల విమానయాన సంస్థలపై ఆర్థికంగా ఒత్తిడి పడింది. విమానయాన అధికారుల అంచనాల ప్రకారం 60 నుంచి 80 కోట్ల వరకు అదనంగా వ్యయం చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. గత మంగళవారం అంటే అక్టోబర్ 15న ఢిల్లీ నుంచి చికాగోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా బీ – 77 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానం ఇండియా నుంచి బయలుదేరిన 12 గంటల తర్వాత ఈ బెదిరింపు కాల్ రావడంతో.. 200 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఆ విమానం కెనడాలోని రిమోట్ టౌన్ ఇకాలూయిట్ విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత రెండు రోజులకు ఆ విమానం అక్కడ నుంచి చికాగో వెళ్ళింది. బోయింగ్ 777 కంపెనీకి చెందిన విమానం సగటు నెలవారీ అద్దె 4,000,00 నుంచి 6,000,00 డాలర్ల వరకు ఉంటుంది. సగటున రోజువారీ అద్దె 17,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక విమానం గాలిలో ఎగరకుండా అలా ఉందంటే.. ఆ విమానయాన సంస్థకు 17, 000 డాలర్ల వరకు నష్టం వాటిల్లుతుంది. ప్రయాణికులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించడం అదనపు ఖర్చు. కాగా గత కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు బెదిరింపు కాల్స్ బెడద పెరిగిపోయింది. దీనివల్ల విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి..” ఇది పండుగల సమయం. రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే విమానయాన సంస్థలకు గిరాకీ ఉంటుంది. ఇలాంటి బూటకపు కాల్స్ రావడం విమానయాన సంస్థలకు ఇబ్బందిగా మారింది. దీనిని ఒకరకంగా ఆర్థిక ఉగ్రవాదం అని చెప్పవచ్చు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప బూటకపు కాల్స్ కు అడ్డు కట్ట పడదని” ఓ సీనియర్ ఎయిర్ లైన్స్ అధికారి పేర్కొన్నారు..