Prakasam YCP: ప్రకాశం వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సాక్షాత్ ఆ పార్టీ కీలక నేత, ప్రాంతీయ సమన్వయకర్త అయిన విజయసాయిరెడ్డి ఎదుటే వైసీపీ నేతలు చెంపలు పగులుగొట్టుకున్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ వీధి పోరాటానికి దిగారు. దీంతో నియోజకవర్గ సమావేశాలు రసాభాసగా మారాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విభేదాలు వెలుగు చూశాయి. నేతల మధ్య ఆధిపత్య పోరును చూసి విజయసాయిరెడ్డి షాక్ కు గురయ్యారు.గత రెండు రోజులుగా విజయ్ సాయి అధ్యక్షతన నియోజకవర్గాల రివ్యూలు జరుగుతున్నాయి. అయితే ఒంగోలు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల మినహా.. మిగతా అన్ని నియోజకవర్గాల్లో వర్గ రాజకీయాలు వెలుగు చూశాయి.
సంతనూతలపాడు సమీక్ష కొట్లాటకు దారితీసింది. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నాగులుప్పలపాడు ఎంపీపీ నల్లమలుపు అంజమ్మ భర్త కృష్ణారెడ్డి వర్గాలు కొట్లాటకు దిగాయి. ఎంపీపీ అంజమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యేసుధాకర్ బాబు వైఖరిని తప్పు పట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరుడు విజయ్ కుమార్ ఆమెను నెట్టేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటిస్తూ విజయ్ కుమార్ చెంపను చెల్లుమనిపించారు. దీంతో రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఈ హఠాత్ పరిణామంతో విజయ్ సాయి రెడ్డి ఆందోళనకు గురయ్యారు. పార్టీ శ్రేణులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు శాంతించారు.
మార్కాపురం, గిద్దలూరు, కొండపి నియోజకవర్గాల సమీక్షలో సైతం నేతల మధ్య కీచులాటలు వెలుగు చూశాయి. మార్కాపురం నియోజకవర్గ రివ్యూ జరుగుతుండగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. స్థానికేత్రుడైన పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తాను టిక్కెట్ ఆశిస్తున్నానని, రావడం తప్పు ఎలా అవుతుందని సూర్య ప్రకాశ్ రెడ్డి సమాధానం ఇవ్వడంతో.. ఒక్కసారిగా ఎమ్మెల్యే వర్గీయులు రెచ్చిపోయారు. గిద్దలూరు నియోజకవర్గ సమావేశం సైతం గరంగరంగా సాగింది. ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరుపై కొందరు స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే సపోర్ట్ చేయమని తేల్చి చెప్పారు. కొండపి సమీక్షలో సైతం నియోజకవర్గ ఇన్చార్జ్ వరికుటి అశోక్ బాబు తీరుపై స్థానిక నేతలు విజయ్ సాయి రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులై.. తొలిసారిగా ప్రకాశం జిల్లా కు వచ్చిన విజయ్ సాయి రెడ్డికి వైసీపీలో అసమ్మతి రాజకీయాలు తలనొప్పి తెచ్చిపెట్టాయి.