Asia Cup 2023: ఆసియా కప్ – 2023 మ్యాచ్‌లో కీలక దశకు చేరుకున్నాయి. సూపర్ – 4లో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను మట్టికరిపించిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో శ్రీలంకను సైతం చిత్తుచేసి ఫైనల్ చేరింది. యువ ఆటగాడు దునిత్ వెల్లలగే స్పిన్ మంత్రంతో భారత్ తక్కువ పరుగులకే పరిమితమైనా, ఆ తర్వాత టీమిండియా సైతం అదే స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసింది.
రాణించిన టీమిండియా బౌలర్లు..
శ్రీలంకతో ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ బౌలర్లు విజృంభించారు. కుల్దీప్, రవీంద్రజడేజా, బూమ్రా, సిరాజ్ వరుస వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్‌ను ఫైలన్‌కు చేర్చారు. అయితే ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియాను ఎవరు ఢీకొట్టేది ఎవరు అన్న ఆసక్తి నెలకొంది.
బంగ్లాదేశ్‌తో భారత్ చివరి మ్యాచ్..
శ్రీలంకపై విజయంతో రోహిత్ సారథ్యంలోని టీమ్ ఇండియా ఆసియా కప్ 2023లో ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకపై భారత్ అద్భుతమైన విజయం సాధించగా, బంగ్లాదేశ్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. బంగ్లా జట్టు పాక్, శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఈ టీమ్‌తో భారత్ తన చివరి సూపర్–4 గేమ్ ఆడనుంది. తద్వారా ఫైనల్‌కు సన్నద్ధం కానుంది.
భారత్‌ను ఢీకొట్టేదెవరు..
టోర్నీలో భారత్ ఫైనల్‌కి వెళ్లడం, బంగ్లాదేశ్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించడంతో.. రెండో స్థానం కోసం పాకిస్థాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. ఆసియా కప్‌లో గురువారం పాక్ తన చివరి సూపర్ 4 మ్యాచ్ ఆడనుంది. బాబర్ అజామ్ నేతృత్వంలోని ఆ జట్టు శ్రీలంకతో తలపడనుంది. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు.. ఆదివారం ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది.
మ్యాచ్ రద్దయితే..
ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు వెళ్తుంది. అంటే శ్రీలంక తుది పోరుకు క్వాలిఫై అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్‌రేట్ విషయంలో పాకిస్తాన్ కంటే శ్రీలంక మెరుగ్గా ఉంది. సూపర్–4లో రెండు మ్యాచ్‌లు గెలిచి–4 పాయింట్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. శ్రీలంక, పాక్ ఒక్కో విజయంతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి.
ఫేవరెట్ టీమిండియానే..
చివరి సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్, శ్రీలంకను ఓడిస్తే.. నెట్ రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ఫైనల్‌కు వెళ్తుంది. దీంతో కప్ కోసం మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరు జరుగుతుంది. అయితే ఫైనల్‌కు ఏ జట్టు వెళ్లినా.. ప్రస్తుతం టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. టోర్నీలో మంచి ఆధిపత్యం కనబర్చిన భారత్.. ఇప్పటికే ఏడుసార్లు ఆసియా కప్‌ను గెలుచుకోగా, పాకిస్తాన్ రెండుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది.