
కరోనా వ్యాక్సినేషన్, కరోనా జాగ్రత్తల విషయంలో ప్రభుత్వాల వైఫల్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టులు కడిగేశాయి. అటు సుప్రీంకోర్టు కేంద్రాన్ని.. ఇటు హైకోర్టు తెలంగాణ సర్కార్ ను చీల్చిచెండాడేశాయి.
తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ నివారణ చర్యలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది.
ప్రైవేటు ఆస్పత్రులపై 174 ఫిర్యాదులు వచ్చాయని.. 21 ఆస్పత్రులకు కోవిడ్ చికిత్సల లైసెన్స్ లు రద్దు చేశామని డీహెచ్ హైకోర్టుకు వెల్లడించారు. అయితే లైసెన్స్ రద్దు చేస్తే సరిపోతుందా? ఆస్పత్రులు వసూలు చేసిన అధిక చార్జీలు తిరిగి చెల్లించాయా? అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. లైసెన్స్ ల రద్దు కన్నా బాధితులకు చార్జీలు ఇప్పించడం ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక మూడో దశ కోవిడ్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డీహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలిపారు. ఆక్సిజన్ పడకలు, ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తికి చర్యలు చేపట్టామని.. సొంతంగా ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు ఆస్పత్రులకు చెప్పామని తెలంగాణ ప్రభుత్వం తరుఫున డీహెచ్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు.
ఇక కేంద్రప్రభుత్వం వ్యాక్సినేషన్ తీరుపై సుప్రీంకోర్టు కడిగేసింది. 18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్ అన్నది ఉచితంగానే వేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి.. అంతకన్నా తక్కువ వయసున్న వారు కొనుగోలు చేయాలని అనడం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇది ప్రాథమికంగా నియంత్రృత్వ పోకడకు అద్దం పడుతుందని.. ఏమాత్రం సహేతుకం కాదని విమర్శించింది. ఈ పాలసీలో చాలా లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. దీన్ని కేంద్రం సమీక్షించుకోవాలని అన్నది.
ఇక ప్రభుత్వ విధానాల్లో న్యాయవ్యవస్థ జోక్యం వద్దన్న కేంద్రం వాదనను సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ప్రజల రాజ్యాంగబద్దమైన హక్కులను హరించేవిధంగా ఉన్నప్పుడు కోర్టు మౌన ప్రేక్షకుల్లా ఉండజాలవని సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమని సెకండ్ వేవ్ లో మరణించిన వారి అత్యధుకులు 45 ఏళ్లలోపు వారేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారని.. ఫంగస్ ల బారినపడ్డారని సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
దేశంలో యువత ఎక్కువగా ఈసారి కరోనా బారినపడుతున్నారని.. అందుకే 45 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ ఉచితంగా వేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇలా కేంద్రాన్ని సుప్రీంకోర్టు.. తెలంగాణ సర్కార్ ను హైకోర్టు కరోనా విషయంలో నిలదీసింది. ప్రభుత్వాల వైఫల్యాలపై కడిగిపారేసింది.