AP Contractors: ఏపీలో అభివృద్ధి పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు ఓవైపు చేతులెత్తేస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే మరోవైపు వచ్చే జనవరిలోగా 15 వేల కోట్ల రూపాయలను చెల్లింపులకు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ లెక్కన కాంట్రాక్టర్లు సంబరపడిపోవాలి. కానీ ఇలా కేటాయింపులన్నీ అస్మదీయ కంపెనీలకేనని తెలుస్తోంది. మొన్నటికీ మొన్న రాష్ట్రవ్యాప్తంగా రహదారులు నిర్మిస్తామని.. టెండర్లు సైతం పూర్తయ్యాయని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే అవన్నీ ఐప్యాక్ ప్రతిపాదించిన రహదారులేనని తేలింది. టెండర్లు పూర్తయ్యాక కూడా పనులు చేయలేమని సంబంధిత కాంట్రాక్టర్లు పక్కకు తప్పుకున్నారు.
సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు నిర్మిస్తున్న సొంత పార్టీ నేతలకు సైతం బిల్లులు చెల్లించడంలో జగన్ సర్కారు వెనుకబడింది. ఇలా పనులు చేపట్టిన ఒకరిద్దరూ సర్పంచులు బలవన్మరణాలకు పాల్పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయినా చెల్లింపులకు మాత్రం జగన్ ముందుకు రావడం లేదు. చివరకు గడపగడపకు పేరిట సచివాలయానికి కేటాయించిన 20 లక్షల రూపాయలతో నిర్మించిన పనులకు సైతం బిల్లులు చెల్లించలేదు. కానీ తన అస్మదీయ, తన సామాజిక వర్గానికి చెందిన బడా కాంట్రాక్టర్లకు మాత్రం పనులు చేయకుండానే వేలకోట్ల రూపాయలు ముట్ట చెప్పేందుకు సిద్ధపడుతుండడం విశేషం.
సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో అస్మదీయులకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడం జరుగుతుంటుంది. కానీ ఈసారి జనవరి కల్లా ఈ చెల్లింపులు పూర్తి చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సీఎం జగన్ బంధువులైన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యజమానులు, అరబిందో గ్రూపునకు ఏకంగా 15 వేల కోట్లు బిల్లులు రూపంలో చెల్లించేందుకు జగన్ సర్కార్ సిద్ధపడుతుండడం చర్చనీయాంశంగా మారింది. తమవారికి వేలకోట్ల చెల్లింపుల కోసం అప్పులు చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఆలోచించిన మాదిరిగానే.. రేప్పొద్దున్న తాము కూడా బోనులో నిల్చోవలసి ఉంటుందని మాత్రం ఆలోచన చేయలేకపోతోంది.
చిన్న చిన్న పనులు చేసే కాంట్రాక్టర్లకు అస్సలు బిల్లులు ఇవ్వడం లేదు. ఒకరిద్దరూ హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేదో బతుకుతెరువు కోసం పొరపాటున పనులు చేసినా ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఓ హోటల్ నుంచి బాధితులకు తిండి ప్యాకెట్లు అందించారు. కానీ ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. చివరికి హోటల్ యజమాని స్పందనలో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఇటీవల లోకకళ్యాణార్థం దేవాదాయ శాఖ హోమం చేసింది. హోమానికి గాను అరటి చెట్లు సరఫరా చేసిన వారికి ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. చివరకు సీఎం పర్యటనకు పరదాలు కట్టిన వారికి సైతం బిల్లుల చెల్లింపులు లేవు. కానీ పనులు జరపకుండానే అస్మదీయ కంపెనీల కోసం వేలకోట్ల రూపాయలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇవ్వడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించింది. కానీ ఏం లాభం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించే స్థాయిలో కేంద్రం ఉందా అంటే? లేదనే సమాధానం వినిపిస్తోంది.