Telangana Assembly Election: తెలంగాణ ఎన్నికల్లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. త్రిముఖ పోటీలో ఎవరిది పై చేయిగా నిలుస్తుందో చూడాలి. అన్ని పార్టీలు విజయం పై నమ్మకం పెట్టుకున్నాయి. అయితే మొన్నటి వరకు ఒంటరి పోరాటానికి సిద్ధమైన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన వైపు చూస్తోంది. ఇప్పటికే పవన్ ను కలిసిన కిషన్ రెడ్డి మద్దతును కోరారు. పొత్తు వరకు ఓకే కానీ.. మద్దతు విషయంలో మాత్రం పవన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా తెలంగాణలో పొత్తుల గురించి చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ను కిషన్ రెడ్డి స్వయంగా ఢిల్లీ తీసుకెళ్లారు. అమిత్ షా తో భేటీ అయ్యేలా చూశారు. దీంతో అక్కడ జనసేన టిడిపి పోటీ చేస్తాయా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పుడు గానీ పొత్తులు కుదిరితే.. దాని ప్రభావం ఏపీలో కూడా ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. సీఎం జగన్ బిజెపి టార్గెట్ చేసినా అది పరోక్షంగా వైసీపీకే ప్రయోజనం. ఒకవేళ జగన్ పై పాత కేసులు తిరగదుడిన సానుభూతి రూపంలో వైసిపి కే లాభం. టిడిపి, జనసేన, బిజెపి కూటమి కడితే ప్రజలు హర్షించరని సర్వేలు చెబుతున్నాయి. బిజెపితో పొత్తు టిడిపి, జనసేనలకు నష్టమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొన్నటి వరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోయింది. అధికారంలోకి వచ్చేంతగా దూకుడు కనబరిచింది. తీరా ఎన్నికలు సమీపించేసరికి కొన్ని రకాల కారణాలతో వెనుకబడిపోయింది. ఇప్పుడు పోటీ చేయడానికి నానా తంతాలు పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో టిడిపి, జనసేనలను కలుపుకొని ముందుకెళ్తే గుడిలో మెల్ల అన్నట్టు పరువు దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. అటు తెలుగుదేశం పార్టీ అవసరాలు, ఇటు మిత్రుడు పవన్ ద్వారా రెండు పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. సెటిలర్స్ తో పాటు కమ్మ, కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకుగాను ఈ కొత్త ఎత్తుగడకు తెర తీసింది.
బిజెపితో పొత్తు వల్ల టిడిపి, జనసేనలకు ప్రయోజనం అంతంత మాత్రమే. అదే సమయంలో బిజెపికి మాత్రం ప్లస్ అవుతుంది. కానీ ఈ కలయిక ఏపీలో టిడిపి, జనసేన లకు మైనస్ అవుతుందని టాక్ నడుస్తోంది. ఇది వైసీపీ నెత్తిన పాలు పోసినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు పార్టీలు కూటమి కట్టి సీఎం జగన్ కేసులతో టార్గెట్ చేసినా అది అంతిమంగా వైసిపికి లబ్ధి చేకూరుస్తుంది. ఎస్సీ, ఎస్టి, మైనారిటీ ఓట్లు గుంప గుత్తిగా ఆ పార్టీకే పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని అటు టిడిపి, ఇటు జనసేన శ్రేణులు తమ నాయకత్వాలను కోరుతున్నారు.