Samajika Sadhikara Bus Yatra: ఏపీ వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో నేడు సామాజిక సాధికార యాత్ర ప్రారంభం కానుంది. బిసి, ఎస్సీ, ఎస్టి, మైనార్టీల కోసమే ఈ యాత్ర చేపడుతున్నట్లు వైసిపి హైకమాండ్ ప్రకటించింది. అయితే ముందుగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనే సామాజిక సాధికారత లేదు. యాత్ర ద్వారా ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏ రంగంలోనైనా, ఏ శాఖలోనైనా తన సామాజిక వర్గంతో సీఎం జగన్ నింపేశారు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో సైతం ఆ సామాజిక వర్గం వారిదే పెత్తనం. అంతెందుకు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో సైతం డీఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నది వారే. ఇటువంటి తరుణంలో సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టడం కాస్త అతి చేయడమే.
సీఎం జగన్ చుట్టూ ఉన్న ఆ నలుగురు అదే సామాజిక వర్గం. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విడగొట్టి.. వాటి బాధ్యతలను అదే సామాజిక వర్గ నేతలకు కట్టబెట్టారు. నామినేటెడ్ పదవుల్లోనూ వారే. రాష్ట్రంలోనే అన్ని యూనివర్సిటీల్లో వీసీలు, కీలక విభాగాధిపతులు వారే.అక్కడ కాదు ఇక్కడ కాదు అన్నింటా వారే. ఇటువంటి సమయంలో సామాజిక సాధికారిక పేరు పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు సిద్ధపడటం ఒక రకమైన సాహస చర్యే.
సీఎం జగన్ పదేపదే తన పోటీ పెత్తందారులతో అని చెబుతుంటారు. తాను పేదల పక్షమని ఆర్భాటం చేస్తుంటారు. అయితే జనం ఎవరేమిటో గుర్తించలేనంత అమాయకంగా లేరు. అధికారం, పదవులు ఇచ్చినట్టే ఇచ్చి.. పవర్స్ లాక్కున్న తీరు అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో వైసిపి కోఆర్డినేటర్లు సామంత రాజులుగా వ్యవహరిస్తున్నారు. వారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారేనని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంతెందుకు పార్టీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది. అసలు ఆ పార్టీలో బిసి, ఎస్సీ, ఎస్టి, మైనార్టీ ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం దక్కుతుందా? అంటే మౌనమే సమాధానమవుతోంది. పదవులు ఇవ్వడమే కాదు.. పవర్స్ ఇచ్చినప్పుడే ప్రజలు గుర్తిస్తారు. అది చేయనప్పుడు ఈ యాత్రల పేరిట హడావిడి చేసినా ప్రయోజనం శూన్యం.
వైసిపికి గత ఎన్నికల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు మద్దతుగా నిలబడ్డారు. ఏకపక్షంగా జగన్ కు అధికారం అప్పగించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి ప్రత్యేకంగా కలిగే ప్రయోజనం ఒక్కటి లేదు. నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన పథకాలే.. అన్ని వర్గాలతో కలిపి ఇచ్చారు. పోనీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. నిధులు, విధులు అప్పగించారా అంటే అది కూడా లేదు. గత నాలుగున్నర ఏళ్లుగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఇప్పుడేమో సామాజిక సాధికారిత పేరిట అన్ని చేశామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ చర్యలపై ఈ వర్గాలేవి సంతృప్తిగా లేవు. చివరకు వైసీపీలో కొనసాగుతున్న ఆ వర్గాల నాయకులు సైతం అసంతృప్తితో అంతర్మధనం చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తున్న వైసీపీ మంత్రులు, కీలక నేతలు కలవరపాటుకి గురవుతున్నారు.