TDP: కడప జిల్లా.. ఈ మాట చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది వైయస్ కుటుంబం. దశాబ్దాలుగా ఆ జిల్లా పై ఆధిపత్యం ఆ కుటుంబానిదే. పేరుకే పులివెందుల కానీ.. కడప జిల్లానే శాసించింది ఆ కుటుంబం. కానీ ఓ రెండు నియోజకవర్గాలు మాత్రం వైయస్ కుటుంబానికి కొరకరాని కొయ్యగా మారాయి. అక్కడ పట్టు సాధించేందుకు దశాబ్దాలుగా వేచి చూడాల్సి వచ్చింది. అవే జమ్మలమడుగు, రైల్వే కోడూరు నియోజకవర్గాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రెండు నియోజకవర్గాలు ఆ పార్టీకి కంచుకోటలు. 2004 కాంగ్రెస్ ప్రభంజనంతో ఈ కోటలకు బీటలు వారాయి. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి అక్కడ పట్టు దొరకలేదు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేందుకు నాయకత్వం వ్యూహాలు రూపొందిస్తోంది.
టిడిపి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 1983 లో ఎన్నికలు జరిగాయి. అప్పటినుంచి జమ్మలమడుగు, రైల్వే కోడూరు లో ఆ పార్టీకి ఎదురులేని విజయాలు దక్కుతూ వచ్చాయి. జమ్మలమడుగులో 1983,1985,1989 లో టిడిపి అభ్యర్థిగా దివంగత గుండ్లకుంట శివారెడ్డి వరుస విజయాలను సాధించారు. అటు తరువాత ఆయన సోదరుడు కుమారుడు రామసుబ్బారెడ్డి 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2004 నుంచి అక్కడ సీన్ మారింది. 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనే మరోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుధీర్ రెడ్డి గెలుపొందారు. గత నాలుగు టెర్ముల్లో టిడిపి ఓడిపోయింది. 1999 వరకు రైల్వే కోడూరులో సైతం టిడిపి విజయం సాధిస్తూ వచ్చింది. 2004 నుంచి జరిగిన నాలుగు ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది.
ఈ రెండు నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.2024 ఎన్నికల్లో గెలుపొందాలని ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంది. జమ్మలమడుగు అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డిని ఇక్కడి నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. ఆది నుంచి నియోజకవర్గంలో ఈ కుటుంబానికి ప ట్టు ఎక్కువ. ఇటు రైల్వే కోడూరులో సైతం బలమైన అభ్యర్థిని బరిలో దించాలని టిడిపి చూస్తోంది. గతంలో పోటీ చేసిన నాగేంద్ర ప్రసాద్ తో మరో ఇద్దరు మహిళల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక, అంగ బలం ఉన్న అభ్యర్థులకు టికెట్లను కట్టబెట్టేందుకు నాయకత్వం ఆలోచిస్తోంది. ఒకప్పటి కంచుకోటలను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ ఉంది.