Telugu States : కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే వరద సాయం అందించిన కేంద్ర ప్రభుత్వం.. మరోసారి భారీగా నిధులు కేటాయించింది. రెండు రాష్ట్రాల్లోనూ ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని పలు రోడ్ల కోసం ఈ నిధులను అందించింది. ఈ మేరకు కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరాలను వెల్లడించారు. ఈ నిధులతో రోడ్ల నిర్మాణం మరింత సుగమం కానుంది. పలుమార్లు కేంద్రాన్ని కలిసి నిధుల కోసం విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రులను విన్నపాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో 200.06కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్)నుంచి రూ.400 కోట్లు కేంద్రం కేటాయించింది. అలాగే.. తెలంగాణలో జాతీయ రహదారి 565లో నల్గొండ గుండా వెళ్లే నకిరేకల్-నాగార్జునసాగర్ మార్గంలో రద్దీని తగ్గించేందుకు రూ.516 కోట్లు కేటాయించింది. అలాగే.. ఏపీలోని గుంటూరు-నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98కోట్లతో శంకర్ విలాస్ ఆర్‌ఓబీని నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా నాలుగు వరుసలతో నిర్మించనున్నారు. దాంతో ఇక్కడ వాహనదారుల కష్టాలు తొలగిపోనున్నాయి. ఆర్ఓబీ గుండా సేఫ్ జర్నీతోపాటు.. సమయం కూడా కలిసిరానుంది.
ఇటీవల ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ కలిసి రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో చర్చించారు. తమ రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు అందించారు. ఈ మేరకు ఈ ప్రకటన వెలువడింది. తెలంగాణలో 516 కోట్లతో 14కిలోమీటర్ల మేరకు నాలుగు వరుసల బైపాస్ రోడ్డు కేంద్రం నిర్మించనుంది. అలాగే.. రెండు తెలుగు రాష్ట్రాల అనుసంధానానికి ఈ 565 జాతీయ రహదారి చాలా కీలకం కావడంతో ఈ నిధులు కేటాయించినట్లుగా తెలుస్తోంది. నకిరేకల్ కూడలి నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు.. నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి మీదుగా వెళ్తుంది. ప్రస్తుతం ఈ రోడ్డుపై భారీ వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో కొత్తగా బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది.
ఇటీవల ఢిల్లీకి రావాలంటూ ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం నుంచి పిలుపువచ్చింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వరద సాయంతోపాటు ఇతర సాయంపై చర్చించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏ మాత్రం సరిపోవని లెక్కలతో సహా వివరించారు. కేంద్రం కూడా వీరి నుంచి వినతులను స్వీకరించింది. అందులోభాగంగా ఈ నిధులు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లోనూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నిధులు కేటాయించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు. అయితే.. వీటితోపాటే ఇచ్చిన మరిన్ని విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే వర్షాలతో రెండు రాష్ట్రాలు కూడా ఆగమైన పరిస్థితిలో కేంద్రం నుంచి అందించిన ఈ సహాయం కంటితుడుపు చర్యగానే భావించవచ్చు. ఎందుకంటే.. వేల కోట్ల నష్టం జరిగితే.. కేవలం వందల కోట్లలోనే సాయం అందించడం ఒకవిధంగా విమర్శలకు దారితీసింది.