Real Estate: రియల్‌ ఢమాల్‌.. కొనేటోళ్లు లేక గోళ్లు గిల్లుకుంటున్న రియల్టర్లు., రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్‌ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు పూర్తిగా చతికిలబడ్డాయి. అపార్లుమెంట్లు కూడా కొనడం లేదు

Written By: Raj Shekar, Updated On : October 15, 2024 3:59 pm

Hyderabad Real Estate

Follow us on

Real Estate: తెలుగు రాష్ట్రాల్లో ఏడాది క్రితం వరకు రియల్‌ వ్యాపారం జోరుగా సాగింది. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత ఒక్కసారిగా రియల్‌ భూమ్‌ పడిపోయింది. భూములు కొనేవారు కానరావడం లేదు. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ ప్లాట్లు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో మూడు నెలలుగా వ్యాపారం పూర్తిగా డీలాపడింది. అయితే దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మరీ దారుణంగా ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. హైదరాబాద్‌లో పెరగడమే గానీ, తగ్గిన దాఖలాలు లేవు. ఇక ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో భూముల అమ్మకాలు జోరందుకుంటాయనుకున్నారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ డీలా పడింది.

తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్‌..
తెలంగాణలో రియల్‌ వ్యాపారం తగ్గడానికి ప్రధాన కారణం హైడ్రా కూల్చివేతలే. హైడ్రా సంస్థ ఏర్పాటుతో కాల్వలు, చెరువులు, నాలాలపై నిర్మాణాలను హైడ్రా తొలగిస్తుండటంతో ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అన్నీ సక్రమంగానే ఉన్నప్పటకీ ఎక్కడో ఒక అనుమానం. తాము స్థలం కొనుగోలు చేసినా, విల్ల కొన్నా.. అపార్టుమెంటు కొన్నా.. అది ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందా… బఫర్‌ పరిధదిలో ఉందా అన్న భయం వారిని వెంటాడుతుంది. రిజిస్ట్రేషన్లు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. మామూలుగా అయితే హైదరాబాద్‌లో ఎలాంటి అవాంతరాలు వచ్చినా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు నిత్యం జరుగుతుంటాయి.

ఖాళీగా ఫ్లా్లట్లు..
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో నిర్మించిన అపార్ట్‌మెంట్లు ఫ్లాట్లు కూడా ఖాళీగా ఉంటున్నాయి. తక్కువ ధరకు ఇస్తామన్నా కొనేవారు ముందుకు రావడం లేదు. దీంతో బ్యాంకు రుణాలు, వడ్డీలకు అప్పులు తెచ్చి అపార్టుమెంట్లు నిర్మించిన రియల్టర్లు ఆందోళన చెందుతున్నారు. తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేద వ్యక్తం చేస్తున్నారు. ఆఫర్లు ఇచ్చినా కొనేవారు లేరని వాపోతున్నారు.

ధరలు పెంచేయడంతో…
ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రియల్‌ వ్యాపారం తగ్గడానికి ప్రధాన కారణం ధరల పెంపే. కూటమి అదికారంలోకి రాగానే, అమరావతిలోని భూముల యజమానులు ధరలను భారీగా పెంచేశారు. ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అడుగులు వేస్తున్నా.. ధరల కారణంగా ఇక్కడ స్థలం కొనేందకు ఎవరూ ముందుకు రావడం లేదు. వైసీపీ హయాంలో ఎకరాకు రూ.కోటి ఉన్న భూమి.. ఇప్పుడు రూ. 3 కోట్ల నుంచి రూ.4 కోట్లు పలుకుతోంది. వైసీపీ మూడు రాజధానుల నిర్ణయం కారణంగా ఏపీలో భూముల ధరలు పడిపోయాయి. ఇప్పుడు ధరల పెంపు కారణంగా రియల్‌ వ్యాపారం డీలా పడింది.

అమరావతికి అడుగు పడక..
ఇక మరో కారణం అమరావతి నిర్మాణానికి అడుగు పడలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావొస్తున్నా నిధులు కేటాయించలేదు. కేంద్రం అమరావతికి రూ.15 వేల కోట్లు ఇస్తామని చెప్పినా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఇక భూములపై కొంతమంది అధికార పార్టీ నేతల పెత్తనం ఉంది. ఈ కారణంగా కూడా చాలా మంది స్థలం కొనుగోలుకు ముందుకు రావడం లేదు. అధికార పార్టీ నేతల కారణంగా మోసపోతామని భయపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. రాజధాని మారితే ఎలా అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అందుకే అమరావతి ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లోకొనుగోలు చేయడం మేలని భావిస్తున్నారు.

ఈగలు తోలుకుంటున్న వ్యాపారులు..
రెండు రాష్ట్రాల్లో రియల్‌ వ్యాపారం పూర్తిగా పతనమైంది. ఈ పరిస్థితిలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఇప్పుడు ఈగలు తోలుకుంటున్నారు. అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఎన్నాళ్లు ఈ పరిస్థితి ఉంటుందో తెలియన, తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడంలేదని పేర్కొంటున్నారు.