ఏపీలో అధికారంలో ఉన్న సీఎం జగన్.. కేంద్రంతో గొడవలకు పోకుండా సఖ్యతతో ఉంటున్నాడు. ఒకవిధంగా కేంద్రానికి మిత్రపక్షంలా మారిపోయాడు. అయితే.. సీఎం జగన్ కేంద్రానికి అన్నివిధాలా సహకారిగా ఉన్నా కేంద్రం నుంచి మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో సపోర్ట్ దొరకడం లేదనేది స్పష్టం అవుతోంది.
Also Read: వివేకా హత్య కేసు: బండారం బయటపడుతోందా?
ఇందుకు తాజా ఉదాహరణ పోలవరం ప్రాజెక్టే. సహాయ, పునరావాసాలతో కలిపి గత ప్రభుత్వం దాదాపుగా రూ.55 వేల కోట్లకు ఆమోదింప చేసుకుంది. దాని కోసం అప్పటి టీడీపీ ఎంపీ.. నాటి ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. కేంద్రంపై పోరాడారు కూడా. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదం తెలిపిన అంచనాలకు కేంద్రం కొత్త కొర్రీలు పెడుతోంది. తాజాగా.. పోలవరానికి పెట్టే ఖర్చు 2013–-14లో ఎంత ఉంటుందో అంతే ఇస్తామని చెబుతోంది. దీని వల్ల కనీసం ఇరవై వేల కోట్ల వరకూ అంచనాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇది జగన్ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి.
విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. ఆ తర్వాత 2013–-14 ధరల ప్రకారం రూ.30,719 కోట్లుగా జలసంఘం నిర్ణయించింది. అయితే కేంద్రం వద్ద ప్రక్రియ ఆగి సాగింది. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే సమయానికి 2017 సంవత్సరం వచ్చింది. ఈ కారణంగా అప్పటి ధరల ప్రకారం మళ్లీ అంచనాలను తయారు చేశారు. కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ రూ.55,657 కోట్లుగా నిర్ణయించింది. అంచనాల సవరణ కమిటీ దాన్ని రూ.47,725 కోట్లకు తగ్గించింది. ఈ మొత్తానికి కేంద్ర జలశక్తి మంత్రి ఆమోదముద్ర వేసి ఆర్థిక శాఖకు పంపారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు.
Also Read: అలా అయ్యాడో లేదో.. అచ్చెన్న మొదలెట్టాడు!
తాజాగా 2013–-14 ధరల ప్రకారం చెల్లిస్తామని.. పెరిగిన ఖర్చుతో తమకు సంబంధం లేదని కేంద్రం వాదిస్తోంది. అంతే కాదు.. విద్యుత్ ప్రాజెక్ట్, తాగునీటి సరఫరాకు చేసే ఖర్చును తాము భరించబోమని మెలిక పెడుతోంది. దీనికి కేంద్రం అన్ని స్థాయిలో ఆమోదం తెలిపితే..ఇక ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ కోసం కంటి తుడుపుగా రెండు మూడు వేల కోట్లకు మించి వచ్చేలా లేవు. కాగా.. ఇప్పటికే రూ.పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చామని కేంద్రం చెబుతూ వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా పోవలరానికి రూ.పదిహేను వేల కోట్లు కావాలని అడుగుతుంటారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం.. ఈ సాయం అడగుతూ వస్తున్నారు. అయితే.. ఇప్పుడు మొత్తంగా కలిపి ప్రాజెక్ట్ నిధులకే టెండర్ పెట్టేసింది. అయితే.. కేంద్రం అలా వాదిస్తున్నా జగన్ మాత్రం ఎలాంటి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. అదే మెతక వైఖరితో ఉంటుండడంతో కేంద్రం కూడా ఈ అంశాన్ని లైట్ తీసుకుంటోందని తెలుస్తోంది.