Revanth Reddy- Congress Senior Leaders: మహాసముద్రంలాంటి కాంగ్రెస్ పార్టీలో చిన్న చేపపిల్ల మన ‘రేవంత్’. అందులోని తిమింగలాలు లాంటి వృద్ధ జంబూకాల ఆటలకు అరటిపండుగా మారిపోతున్నాడు. వాళ్లను తీసేయలేడు. అలాగని ఉంచితే తన సీటును కాపాడుకోలేడు. అధిష్టానం ఒత్తిడి మరోవైపు.. మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ నావను కాపాడేందుకు రేవంత్‌ను తీసేయాలా? లేక సీనియర్లను పక్కనపెట్టాలా? తెలియక అధిష్టానం తలపట్టుకుంది. కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్న ఈ ముసలి నేతలు ఇక మారెదెన్నడు? కాంగ్రెస్ తలరాత బాగుపడేదెన్నుడూ..

రంగంలోకి ట్రబుల్ షూటర్..
తెలంగాణ కాంగ్రెస్‌లో రగులుతున్న అసమ్మతి జ్వాలలను చల్లార్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డిగ్గీరాజా(దిగ్విజయ్ సింగ్) రంగంలోకి దిగారు. ప్రియాంకాగాంధీ ఆదేశం మేరకు బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. గురువారం రోజంతా ఆయన అసంతృప్త నేతలతో సంప్రదింపులు, చర్చలు జరుపుతారు. ఈమేరకు నివేదిక తయారుచేసి అధిష్టానానికి అందించే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసిన అసమ్మతి వాదులు.. డిగ్గీరాజాతో పరిస్థితి అసమ్మతి సమసిపోతుందని చాలామంది సీనియర్ నాయకులు ఆశాభావంతో ఉన్నారు.
ఆయనను తప్పిస్తేనే తగ్గుతారా?
కాంగ్రెస్‌లో 9 మంది సీనియర్లు అసమ్మతి వర్గంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరి టార్గెట్ రేవంత్‌రెడ్డి. ఆయనను పీసీసీ నుంచి తప్పించమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారు. దిగ్విజయ్ సింగ్‌తో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సత్సంబంధాలు లేవు. ఇదే ససమయంలో కాంగ్రెస్ సీనియర్లకు డిగ్గీరాజా చాలా దగ్గర. ఆయనతో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో తమ అసంతృప్తిని గుర్తించి దూతను పంపినందుకు వారు మరింత బెట్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా తప్పించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

అసమ్మతి రాగంతో ఉలికిపాటు..
తెలంగాణ కాంగ్రెస్‌లో 9 మంది సీనియర్ నేతలు ఒకే సారి మీటింగ్ పెట్టుకోవడంతో ఉలిక్కిపడిన హైకమాండ్ సలహాదారుడిగా దిగ్విజయ్ సింగ్‌ను నియమించింది. దీంతో దిగ్విజయ్ పలువురికి ఫోన్లు చేసి తొందరపడవద్దని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లు మంగళవారం నాటి సమావేశవాన్ని వాయిదా వేసుకున్నారు.
దిగ్విజయ్‌తో టీపీసీసీ చీఫ్ భేటీ..
ఇదిలా ఉండగా, ఇప్పటికే దిగ్విజయ్‌సింగ్‌ను ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కలిశారు. తన వాదనను వినిపించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ల వ్యవహారశైలి, ఇతర పార్టీలతో అంట కాగుతున్న వైనం.. సొంత పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విషయాలపైనా రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ హైదరాబాద్ పర్యటనపై రేవంత్‌వర్గం పెద్దగా ఆందోళన చెందడం లేదు. కానీ రేవంత్‌కు వ్యతిరేకంగా దిగ్విజయ్ వద్ద పెద్ద ఎత్తున తమ వాదన వినిపించేందుకు సీనియర్లు రెడీ అయ్యారు. అయితే సీనియర్ల డిమాండ్లను హైకమాండ్ ఆలకించే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డినే కొనసాగిస్తారని అందులో మరో మాటే ఉండదని అంటున్నారు.
విధేయులకే భవిష్యత్..
పార్టీకి బద్దులుగా, విధేయులుగా పనిచేసే వారికే పార్టీలో భవిష్యత్ ఉంటుందని దిగ్విజయ్‌సింగ్ ద్వారా అధిష్టానం సందేశం పంపినట్లు సమాచారం. ఆయన ఆ 9 మందికి ఇదే విషయం స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అసమ్మతి సమసిపోకపోతే ఎవరి దారి వారు చూసుకోవాలని దిగ్విజయ్ పరోక్షంగా సూచిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. కారణం ఏదైనా.. హైకమాండ్ తీరుతో అసంతృప్తి నేతలు బలం పుంజుకుంటున్నారని .. ఇది కాంగ్రెస్‌కు చేటు చేస్తోందని ఆ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. మరి డిగ్గీరాజా మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలి.