Corona Crisis On China: తాను పుట్టిన ఇల్లు చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో తాను తవ్విన గోతిలో తానే పడిన చందంగా మారుతోంది చైనా పరిస్థితి. వైరస్‌ను పుట్టించిన చైనా.. అదే వైరస్‌తో విలవిలలాడుతోంది. అక్కడి వైద్యులు అదుపు చేయలేక చేతులు ఎత్తేశారు. మరణ మృదంగం మోగుతోంది. దహన సంస్కారాలు 24 కొనసాగుతున్నాయి. అయినా శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా చైనాలో రాబోయే మూడు నెలల్లో 10 లక్షల మరణాలు నమోదు కావచ్చనే అంతర్జాతీయ పరిశోధకుల అంచనాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజా పరిస్థితిపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. మన దేశంలో వ్యాక్సిన్ పంపిణీ విస్తృతంగా చేపట్టిన నేపథ్యంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించే నిబంధనలను పాటించాలని కోరారు.

-వైరస్ కట్టడి చేయకపోవడంతోనే..
కరోనా వైరస్ పుట్టి ఇప్పటికి మూడేళ్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా విలయం సృష్టించింది. ప్రస్తుతం ప్రపంచమంతా కంట్రోల్‌లోనే ఉన్న వైరస్ పుట్టిన దేశంలో మాత్రం మళ్లీ విజృంభిస్తోంది. వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడంలో చైనా విఫలం కావడమే ఇందుకు కారణం. వైరస్ వ్యాప్తితో సబ్ వేరియంట్లు పుట్టుకురావడం సహజం. కరోనా ఇప్పటి వరకు 500 సబ్ వేరియంట్లు పుట్టుకొచ్చాయి. అయితే అన్నీ ప్రమాదకరం కాలేదదు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరంగా మారింది. చాలా దేశాల్లో మరణాలకు కారణమైంది. తాజాగా చైనాలో విజృంభిస్తున్న సబ్ వేరియంట్ ‘బీఎఫ్7’. ఇది.. వేగంగా వ్యాప్తి చెందడంతోపాట మరణాలకు కారణమవుతోంది. దీంతో ప్రపపంచ దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.
-‘బీఎఫ్7’ నుంచి మరో వేరియంట్ వస్తే..
చైనాలో అత్యంత ప్రమాదకరమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్7 నుంచి మరో సబ్‌వేరియంట్ పుట్టుకురావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వైరస్ ఎంత ఎక్కువ వ్యాపిస్తే.. అంత త్వరగా సబ్ వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీఎఫ్7 నుంచి మరో వేరియంట్ పుడితే అది మరింత ప్రమాదకరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.. మన దేశంలో కూడా కేంద్రం అలర్ట్ అయింది.
-చైనా వ్యాక్సిన్లు వట్టివేనా..
చైనా ప్రపంచ దేశాల కంటే ముందే కోవిడ్ వ్యాక్సిన్లు తయారు చేసింది. రెండు వ్యాక్సిన్లు 2020, జూలై నుంచే పంపిణీ ప్రారంభించింది. కానీ, వైరస్‌ను అవి సమర్థవంతంగా ఎదుర్కొలేదన్న వాదన వినిపిస్తోంది. వ్యాక్సిన్లు పనిచేస్తే ఇప్పటికే కోవిడ్ కట్టడి అయ్యేదని పేర్కొటున్నారు. వ్యాక్సిన్ల వైఫల్యం కూడా చైనాలో కోవిడ్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది.

-నిబంధనల ఎత్తివేతే కొంప ముంచిందా?
చైనాలో కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్‌తోపాటు కఠిన నిబంధనలు అమలు చేశారు. జీరో కోవిడ్‌రూల్ అమలు చేశారు. అంటే ఒక్క కోవిడ్ కేసు నమోదైనా ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం, క్వారంటటైన్ చేయడం, లాక్‌డౌన్ విధించడం వంటి నిబంధనలు అమలు చేశారు. అయితే మూడేళ్లుగా అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై చైనీయులు తిరుగుబాటు మొదలు పెట్టారు. దీంతో సర్కార్ దిగివచ్చింది. జీరో కోవిడ్ నిబంధన గత నెలలో ఎత్తివేసింది. దీంతో వైరస్ వ్యాప్తి ఊపందుకుంది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి.
మొత్తంగా పుట్టిన దేశాన్ని కబళించే స్థాయిలో కరోనా సబ్ వేరియంట్ బలపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం రాబోయే మూడు నెలల్లో చైనాలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని తెలిపింది. చైనా ప్రభుత్వం మాత్రం కరోనా విలయంపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మరణాలు దాస్తోంది. ఇదే ఆ దేశానికి ప్రమాదకరంగా మారుతోంది. ఇతర దేశాల వ్యాక్సిన్లు తీసుకోకపోవడం కూడా పరిస్థితి చేయిదాటిపోయేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.