వలస కార్మికుల భారం రాష్ట్రాలపైననే!

దేశంలోని వివిధ ప్రాంతాలలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకు పోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ, ఈ భారం మొత్తం రాష్ట్రాలపైనే పడవేయడం విస్మయం కలిగిస్తున్నది. పైగా బస్సు లను ఏర్పాటు చేసుకొని తరలించమని చెప్పిన కేంద్రం అందుకోసం కనీసం ప్రత్యేక రైళ్లు నడపడానికి సహితం ముందుకు రావడం లేదు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయి అప్పులతో కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది తలకు […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 12:51 pm
Follow us on


దేశంలోని వివిధ ప్రాంతాలలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకు పోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ, ఈ భారం మొత్తం రాష్ట్రాలపైనే పడవేయడం విస్మయం కలిగిస్తున్నది.

పైగా బస్సు లను ఏర్పాటు చేసుకొని తరలించమని చెప్పిన కేంద్రం అందుకోసం కనీసం ప్రత్యేక రైళ్లు నడపడానికి సహితం ముందుకు రావడం లేదు.

ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయి అప్పులతో కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది తలకు మించిన భారంగానే భావిస్తున్నారు. వలస కార్మికులను తరలించే బాధ్యత రాష్ట్రాలదే అని కేంద్రం స్పష్టం చేయడం గమనార్హం.

స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వలసకార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లు నడపాలని రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గతంలో కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సహితం ఈ విషయమై ప్రధానిని కోరాయి.

ఇప్పటికే కేంద్రం అనుమతితో సంబంధం లేకుండా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజస్థాన్ లో చిక్కుకున్న తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను పంపి వెనుకకు తీసుకు వచ్చారు.

ఆయా రాష్ట్రాలలో ఆర్ధిక కార్యకలాపాల కోసం వెళ్లిన కార్మికులను వెనుకకు తీసుకు రావడానికి వారి సొంత రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపడం సహితం విమర్శలకు దారితీస్తుంది.

పైగా, ఆ విధంగా తిరిగి వచ్చిన వారిని రెండు వారాలపాటు స్వీయ నిర్బంధంలో ఉంచవలసి ఉంటుంది. ఆ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతుంది. వారికి పనులు దొరికే వరకు వారికి రేషన్ అందించే భారం సహితం రాష్ట్ర ప్రభుత్వాలు మోయవలసి ఉంటుంది.

అటువంటప్పుడు కనీసం రవాణా సదుపాయాలను కల్పించడానికైనా కేంద్రం ముందుకు వస్తే తమకు కొంత ఉపశమనం కలిగించినట్లు కాగలదని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

విదేశాలలో చిక్కుకున్న వారికోసం ప్రత్యేక విమానాలు పంపుతున్న ప్రభుత్వం వలస కార్మికులకు ప్రత్యేక రైళ్లను నడిపే విషయంలో ఆసక్తి కనబరచక పోవడం విస్మయం కలిగిస్తుంది.