చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్‌తో వైసీపీ ఎమ్మెల్యేలను లాగేశారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక నలుగురు ఎమ్మెల్యేలు కూడా వచ్చి వైసీపీలో చేరారు. అధికారికంగా వారు టీడీపీ ఎమ్మెల్యేలే. కానీ.. వైసీపీ మద్దతుదారులు. పార్టీలో నేరుగా వారిని చేర్చుకునేందుకు జగన్ ఇష్టపడలేదు. పార్టీలో నేరుగా చేరాలనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ శాసనసభ సాక్షిగా చెప్పడంతో రాజీనామా చేయడానికి ఎవరూ సిద్ధపడలేదు. అందుకే వారి కుటుంబ సభ్యులకు మాత్రం వైసీపీ కండువా కప్పారు.
Also Read: తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. తీవ్ర ఉత్కంఠ!
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ కుమార్ వైసీపీ మద్దతుదారులుగా మారిపోయారు. పార్టీకి రాజీనామా చేసినా, ఎమ్మెల్యే పదవులకు మాత్రం వీరు రాజీనామాలు చేయలేదు. వీరిపై టీడీపీ కూడా అనర్హత వేటు వేయమని కూడా కోరలేదు. శాసనసభలో స్పీకర్ వీరికి ప్రత్యేక సీట్లు కేటాయించారు. అయితే.. ఈ నలుగురు మాత్రం టీడీపీని వీడి వచ్చినా హ్యాపీగా లేరు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వీరికి పెద్దగా ప్రయారిటీ లేకపోవడమే కారణమంటున్నారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన వైసీపీ నేతలకు, వీరికి పొసగడం లేదు. వీరి మధ్య సయోధ్యకు అధినాయకత్వం ప్రయత్నించినా ఫలితం లేదు. రానురాను విభేదాలు తీవ్రమవుతున్నాయి తప్పించి చల్లారేలా లేవు. ఈ నలుగురి పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వీలు లేదు. ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. పార్టీ క్యాడర్ కూడా వీరిని తమ నేతలుగా గుర్తించడం లేదు.
Also Read: ఏపీలో పరిషత్ ఎన్నికలు నిమ్మగడ్డే నిర్వహించాలట..!
కానీ.. చంద్రబాబు ఇతర పార్టీల నేతలను నేరుగా తన పార్టీలోకి చేర్చుకున్నారు. వారు నాడు టీడీపీ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. స్థానికంగా పార్టీ నేతలు వారిని కలుపుకోకపోయినా వారు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. క్యాడర్ కూడా వారిని తమ పార్టీ నేతలుగానే గుర్తించింది. కానీ.. జగన్ నేరుగా పార్టీ కండువా కప్పకపోవడం వల్లనే ఎమ్మెల్యేలు అధికారికంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. అందుకే మిగిలిన ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుదారులుగా మారేందుకు ఇష్టపడటం లేదు. అందుకే వలసలు ఆగిపోయాయంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్