
రాష్ట్రంలో జర్నలిజం రోజురోజుకు పతనావస్థకు దిగజారిపోతుంది. విలువలు లేని జర్నలిజంతో తెలుగు రాష్ట్రాల్లో మీడియా భ్రష్ఠు పట్టిస్తోంది. రెండు వర్గాలుగా మీడియా చీలిపోయి ప్రజలపై తమ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురై బాధగా ఇంట్లో ఉన్న వైసిపి రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు చెందిన ప్రతినిధులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు కారణం అవుతోంది. సదరు ఎమ్మెల్యే తనకు ఆరోగ్యం బాగాలేదు అంటూ చేతులు జోడించి వేడుకున్న వినకుండా ఆ మీడియా ప్రతినిధి ప్రశ్నలు వేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి, ఆ పార్టీకి కొద్దిరోజుల నుంచి పొసగడం లేదు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నిలబెట్టిన అభ్యర్థికి కాకుండా తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారు అంటూ విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. ఈ వ్యవహరంపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి, వైసిపి నాయకులకు మధ్య కొద్ది రోజుల నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో వార్ నడుస్తోంది. సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుతున్నారు.
ఉదయగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ..
రెండు రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనిపై ప్రతిగా స్పందించిన వైసీపీ నాయకులు అంతే స్థాయిలో స్పందిస్తూ చంద్రశేఖర్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. ఈ పరస్పర విమర్శలు కాస్త సవాళ్లు ప్రతి సవాళ్లకు దారి తీసాయి. దీంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉదయగిరి కి వెళ్లి రోడ్డుపై కుర్చీ వేసుకుని అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ వైసీపీ నాయకులకు సవాల్ చేశారు. అయితే వైసీపీ నాయకులు దీనిపై తాజాగా శుక్రవారం స్పందించారు. నిన్న ఏ స్థానంలో కూర్చుని చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారు అదే ప్లేస్ కు వందలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు చేరుకొని చంద్రశేఖర్ రెడ్డి రావాలంటూ వారంతా సవాల్ విసిరారు. ముందుగా చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళతానంటూ ప్రతి సవాల్ చేయడంతో చంద్రగిరి లో ఏం జరుగుతుందో అన్న చర్చ సర్వత్ర నడిచింది.
ఆరోగ్యం బాలేదంటూ వేడుకున్న ఎమ్మెల్యే..
నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే వర్సెస్ వైసిపి వ్యవహారంపై కవరేజీ ఇచ్చే విషయంలో ఓ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ అదుపుతప్పి వ్యవహరించారు. నేరుగా ఎమ్మేల్యే ఇంటికి వెళ్లిన సదరు మీడియా ప్రతినిధి చర్చకు వెళతారా అంటూ ఎమ్మెల్యే మొహంపై లోగో పెట్టి ప్రశ్నించారు. ఈరోజు చర్చకి వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ”నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళను సార్. నాకు హెల్త్ బాలేదు సార్. నా మీదకు వస్తే ఎలా మీరు. నేను ఇప్పుడు అపోలో ఆస్పత్రికి వెళ్లాలి’ అని సదరు మీడియా ప్రతినిధిని వేడుకున్నప్పటికీ ప్రశ్నలు సంధిస్తూ ఉండడం.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ” నిన్న నిన్న అంటూ మమ్మల్ని ఇరికిస్తున్నారని. ప్రాణం పోతున్నా వినకుండా ఏం మాటలు అంటూ’ మీడియా ప్రతినిధిపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. అయినా వినకుండా ఆ మీడియా ప్రతినిధి అక్కడ నుంచి రిపోర్టింగ్ చేస్తూ కుటుంబ సభ్యులను వేధించే ప్రయత్నం చేయడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా యావత్ మీడియాపైనే విమర్శలు వ్యక్తం అయ్యే పరిస్థితిని తీసుకువచ్చారు.
అతిగా స్పందిస్తున్న మీడియాపై విమర్శలు..
ఈ వ్యవహారం పైనే కాకుండా అనేక విషయాల్లో మీడియా వ్యవహరిస్తున్న తీరు పట్ల గత కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. మీడియా పరిధి దాటి వ్యవహరిస్తూ ప్రముఖులను ఇబ్బందులు గురిచేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర విమర్శలు చేసుకోవడంతో పాటు.. తాము అభిమానించే, వ్యతిరేకించే వర్గాలపై భిన్నమైన కథనాలను ప్రచురిస్తూ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయి అన్న విమర్శలు వస్తున్నాయి.