BJP- Ayodhya Temple: భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తోంది. త ద్వారా హ్యాట్రిక్ సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.. బీజేపీ వరుసగా రెండుసార్లు 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. భయంగా సంపూర్ణ మెజారిటీ సాధించి, మూడు దశాబ్దాలకు పైగా దేశంలో నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను తిరగరాసింది. కేంద్రంలో అధికారంలో ఉంటూనే… సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్నది. అయితే బిజెపి విజయం వెనుక కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీల బలహీనతలు ఉంటే ఉండవచ్చును.

మూల కారణం ఇదే
భారతీయ జనతా పార్టీ రెండు మార్లు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రాముడు. 1990 దశకంలో దేశాన్ని కదిలించిన రామ జన్మభూమి ఆందోళన, అద్వానీ రథయాత్ర.. ఆ పార్టీకి ఇప్పటికీ తిరుగులేని బలం.. 1990లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసుల ఆధారంగా వెనుకబడిన కులాలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బిజెపి అప్పటికే విశ్వహిందూ పరిషత్, ఇతర సంఘ్ పరివార్ సంస్థలు సాగిస్తున్న రామ జన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అందుకు అనుగుణంగా అప్పటి బిజెపి అధ్యక్షుడు ఎల్కే అద్వానీ 1990లో రథయాత్రను చేపట్టారు. ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం బాబ్రీ మసీదు కూల్చివేత వరకు సాంస్కృతిక జాతీయవాదం పేరిట బిజెపి సాగించిన ప్రయాణమే ఆ పార్టీ ఎదుగుదలకు నాంది పలికింది. దాని తర్వాత ఏం జరిగింది అనేది చరిత్ర. ఇక అప్పటినుంచి బిజెపి ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని వాగ్దానాలు చేస్తూనే ఉంది.
నెరవేరే రోజు వచ్చింది
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు 2019 నవంబర్లో అనుమతి ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ 2020 ఆగస్టులో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ ఆలయం ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి మరో మారు రామ మందిర్ అంశాన్ని ఎన్నికల ప్రచారం గా ఉపయోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహక యాత్రలు కొనసాగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా… రామ మందిర ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు..వచ్చే ఏడాది జనవరి 1న రామ మందిరాన్ని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరిగే త్రిపురలో ఆయన ఈ ప్రకటన చేశారు.. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించారు.

రాహుల్ కాస్కో
అయోధ్య రాముడు వస్తున్నాడు కాస్కో అన్నట్టుగా అమిత్ షా రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.. ఒక రకంగా రామ మందిర్ వివాదంలోకి కాంగ్రెస్ పార్టీని లాగేందుకే అమిత్ షా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ పేరు తీసుకొచ్చారు.. అయోధ్యలో రామ మందిర్ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ, వామ పక్ష, ఇతర లౌకికవాద పార్టీలు అడ్డుకున్నాయి..ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు పరిధిలో సుదీర్ఘకాలం ఉండేలా చేశాయి.. దీనినే అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో బిజెపి మరో మారు రామ మందిర్ అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈసారి రామ మందిర నిర్మాణం పూర్తి చేసిన నేపథ్యంలో హిందూ ఓటు బ్యాంకు ను మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.. అమిత్ షా సవాల్ ను రాహుల్ గాంధీ ఏ విధంగా స్వీకరిస్తారు అనేది తేలాల్సి ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.