Janasena TDP Alliance: ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమి దూకుడు పెంచుతోంది. ముందుగా రెండు పార్టీల మధ్య సమన్వయం, ఆత్మీయత పెంచుకునేందుకు కార్యక్రమాలను రూపొందించింది. అవి పూర్తయిన వెంటనే ఇరు పార్టీల నాయకులు ప్రజల మధ్యకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎన్నికల ప్రచారాన్ని తలపించనుంది. వై ఎ పి నీడ్స్ జగన్ కార్యక్రమం తో అధికార వైసిపి దూకుడుగా ముందుకెళుతోంది. పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చి యంత్రాంగంతో జరిపిస్తోంది. దానికి విరుగుడుగా, అధికారపక్షంపై మరింత ఒత్తిడి పెంచేందుకు టిడిపి, జనసేనలు సంయుక్తంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించడం విశేషం.
రెండు పార్టీల కలయిక ఈనాటిది కాదు. గత రెండేళ్లుగా పార్టీలు కలుస్తాయని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణులు కొంత సమన్వయం సాధించాయి. స్థానిక ఎన్నికల సమయంలో నాయకత్వాలతో సంబంధం లేకుండా పొత్తు పెట్టుకుని మంచి ఫలితాలు సాధించాయి. అక్కడ నుంచి రెండు పార్టీల కలయికతో.. ఏపీలో అధికారం ఖాయమని ఒక అంచనాకు వచ్చారు. ఇరువురు అధినేతలు కలిసి నడుద్దామని నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు అవినీతి కేసుల్లో అరెస్టు కావడంతో సంఘీభావం తెలిపిన పవన్.. నేరుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే నడుస్తాయని వెల్లడించారు. అప్పటినుంచి రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ మొదలైంది. ఇప్పటికే రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. మేనిఫెస్టో ప్రకటన సైతం పూర్తయింది.
ఇప్పటికే జిల్లా స్థాయిలో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు పూర్తయ్యాయి. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. 14, 15, 16 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 17వ తేదీ నుంచి మాత్రం రెండు పార్టీల నాయకులు ప్రజల మధ్యకు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ ఇన్చార్జిలు ఉన్నారు. ఇప్పుడు సమన్వయానికి గాను జనసేన సైతం ఇన్చార్జిలను నియమించింది. దీనిని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పరిగణిస్తామని జనసేన నాయకత్వం తెలిపింది. ఇప్పటికే 11 అంశాలను ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చారు. అందులో కీలకమైన బీసీలకు రక్షణ చట్టం, రాజధానిగా అమరావతి, పేదలందరికీ ఉచిత ఇసుక విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇరు పార్టీలు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టిడిపి, జనసేన ఉమ్మడిగా ప్రజల్లోకి వెళుతుండడంతో అధికార వైసీపీలో ఒక రకమైన కలవరపాటు కనిపిస్తుంది. ఇంకా సీట్ల సర్దుబాటు లేకుండానే వారు ప్రజల్లోకి రావడం మింగుడు పడడం లేదు. జనసేన దాదాపు 50 స్థానాల్లో సీట్లు ఆశిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అక్కడే ఇరు పార్టీల మధ్య పేచి వస్తుందని వైసిపి ఆశించింది. కానీ సీట్లతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన ప్రజల మధ్యకు వస్తుండడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి. తప్పకుండా ఈ కూటమి ప్రభావం చూపుతుందని.. కూటమి విచ్చిన్నానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.