TDP Janasena Alliance: ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కీలక దశకు చేరుకుంది. ఇరు పార్టీల అధినేతలు కలుసుకొని చర్చలు జరిపారు. రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా వారి మధ్య భేటీ జరిగింది. ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో టిడిపి, జనసేన ఏకతాటి పైకి రావడం విశేషం. విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్ చేరుకున్న పవన్ చంద్రబాబును పరామర్శించారు.సంఘీభావం తెలిపారు. జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టాలని చూసినా బలంగా నిలబడ్డారని చంద్రబాబుకు పవన్ అభినందనలు తెలిపారు. తనకు మద్దతు తెలిపినందుకు చంద్రబాబు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రణాళికలకు సంబంధించి ఇద్దరు అధినేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ దూకుడుగా స్పందించారు. నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించారు. అనంతరం తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి పవనే కీలక బాధ్యతలు తీసుకున్నారు. అటు తెలుగుదేశం పార్టీతో పాటు ఇటు జనసేనకు తానే పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తన వారాహి యాత్రను సైతం వాయిదా వేసుకున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు, ఓట్ల బదలాయింపు పై సైతం ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. జనసేన పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపుకు సంబంధించి సానుకూల వాతావరణం సృష్టించడంలో పవన్ ఒక అడుగు ముందుకు వేశారు.
నాగబాబు కుమారుడి వివాహానికి పవన్ కుటుంబ సమేతంగా ఇటలీ వెళ్లారు. శనివారమే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వచ్చిన వెంటనే చంద్రబాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు తెలంగాణలో రాజకీయ పొత్తులపై బీజేపీ నేతలతో జరిగిన చర్చలు వివరాలను పవన్ వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పోటీ చేయరాదని తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఉన్న నేపథ్యం, కారణాలను చంద్రబాబు పవన్ కు వివరించారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన పవన్ కు చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఖరారు చేయడానికి ఈనెల తొమ్మిదిన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని ఇరువురు నేతలు నిశ్చయించారు. ఈ సమావేశానికి చంద్రబాబు,పవన్ హాజరు కావడం లేదు. రెండు పార్టీల తరఫున ఇతర నేతలు హాజరవుతారు. అయితే ముఖ్యంగా కరువు, అనావృష్టి అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చంద్రబాబు కేసులు ఒక కొలిక్కి వచ్చాక రెండు పార్టీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇరు పార్టీల అధినేతల కలయికతో టిడిపి, జనసేనలో జోష్ నెలకొంది.