YCP: ఏపీలో 2019 ఎన్నికల నాటి పరిస్థితి ఉందా? అంటే కచ్చితంగా లేదనే సమాధానం వినిపిస్తోంది. అప్పట్లో టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పార్టీకి సహాయ నిరాకరణ, జనసేన వేరుగా పోటీ చేయడం, సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన జగన్ ఒక్క ఛాన్స్ కావాలని కోరడం.. తదితర కారణాలతో సానుకూల వాతావరణం ఏర్పడింది. వైసిపి ఘన విజయానికి ఇవన్నీ దోహదపడ్డాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే వైసిపి నేతల నుంచి సానుకూలత రావడం లేదు. అంటే వైసీపీ సర్కార్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పని చేయలేదని తెలుస్తోంది. అదే వ్యతిరేకతకు కారణమవుతోంది.
జగన్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ సైనికుల్లా కష్టపడిన వారు ఉన్నారు. చాలామంది స్వచ్ఛందంగా పనిచేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. ఆయన అభిమానించేవారు క్రమేపి తగ్గుముఖం పట్టారు. ప్రభుత్వంపై మెజారిటీ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా టిడిపి, జనసేన కూటమిపై వైసీపీ తరుపున యుద్ధం చేయడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు. వైసిపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు తప్ప.. అందుకోసం పనిచేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం విశేషం. ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో నిరాశ, నిస్పృహలు అలముకున్న మాట వాస్తవం. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న ధీమా తప్పించి.. మరి ఏ ఇతర సానుకూలతలు వైసీపీకి కనిపించడం లేదు.
వైసిపి సామాజిక సాధికార యాత్ర అసలు లక్ష్యం నీరుగారింది. దీనిపై ప్రజలు కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. పైగా ఈ యాత్ర సాక్షిగా వైసీపీ సర్కార్ లోపాలు వెలుగు చూస్తున్నాయి. సమాజంలో అణగారిన వర్గాల వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించామని చెప్పుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే కేవలం పదవులు ఇచ్చి.. అధికారం మాత్రం తన సామాజిక వర్గానికి కట్టబెట్టారన్న ప్రతిపక్షాల విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. దీంతో ఈ యాత్ర అంతిమ లక్ష్యం దెబ్బతింటోంది. ఈ యాత్ర ద్వారా లాభం కంటే నష్టమే అధికమని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో అధికార పక్షానికి సానుకూలతకు మించి ప్రజా వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల నాటి పరిస్థితికి పూర్తి విరుద్ధంగా ఉంది. పైగా తెలుగుదేశం పార్టీ కసితో ఉంది. దానికి జనసేన తోడైంది. ఈ కూటమి బలంగా కనిపిస్తోంది. పైగా ఎన్నికల ముంగిట జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. చంద్రబాబుపై కేసులు పెట్టడం ద్వారా తన అసలు లక్ష్యం నెరవేర్చుకున్నా.. తటస్తులు, రాజకీయాలతో సంబంధం లేని వారు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, వ్యాపారులు… ఇలా అన్ని వర్గాల వారు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంత వ్యతిరేకతను అధిగమించి విజయాన్ని అందుకోవడం ఆషామాషీ విషయం కాదు. మరి జగన్ ఎలా అధిగమించబోతున్నారో చూడాలి.