Huzurabad: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన హుజూరాబాద్ ఎన్నికలు రెండు రోజుల కిందట ముగిశాయి. చిన్న చిన్న గొడవలు తప్ప ప్రశాంతంగానే ఎన్నికలు సాగాయని చెప్పవచ్చు. అయితే అక్కడ గెలుపు, ఓటముల విషయంలో ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు పోటీ చేసినా.. గెలుపు ఓటములు మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉండబోతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి మాత్రమే ఉపయోగపడనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రెండు పార్టీలు గెలుపు ధీమాతోనే..
హుజూరాబాద్ ఎన్నికలు అనివార్యం అని తెలిసిన నుంచి బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు గెలుపు తమదేనని ప్రకటిస్తూ వచ్చాయి. దానిని నిజం చేసుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించాయి. గెలుపును అందుకోవడానికి వచ్చే ప్రతీ అవకాశాన్ని రెండు పార్టీలు ఉపయోగించుకున్నాయి. ప్రచారంలో కూడా ఎక్కడా తగ్గలేదు. 5 నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్నారు. కొందరు నాయకులైతే అక్కడే మకాం వేశారు. ఓట్లను తమ పార్టీ వైపు మరల్చుకునేందుకు అక్కడి ప్రజల్లోనే తిరిగారు. ప్రజల మనసులోని మాట, వారి కోరికలు వంటివన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. దానిని పార్టీ ముఖ్యనాయకుల దృష్టికి తీసుకెళ్లి వారికి కావలసినవన్నీ సమకూర్చారు. ప్రతీ కుల సంఘాన్నీ పలకరించారు. ప్రతీ యువజన సంఘంతో ముచ్చటించారు. మహిళా సంఘాలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. వారికి కావలసినవన్నీ అందించారు.
అధికార పార్టీ సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకుంటే.. బీజేపీ మాత్రం తెలంగాణలో నిరుద్యోగం, నిరంకుశ పాలన అంటూ ప్రచారం చేశాయి. ఇరు పార్టీలకు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఆద్యాతం ఉత్కంఠ భరితంగా ఎన్నికల ప్రచారం పర్వం సాగింది. చివరికి ఎన్నికలు కొంత ఆందోళనల నడుమ ప్రశాంతంగానే సాగింది. అయితే ఇందులో గెలుపుపై ఇరు పార్టీలు ధీమాతోనే ఉన్నాయి. హుజూరాబాద్ పీఠం తమదేనంటూ చెప్పుకొస్తున్నాయి.
Also Read: Roja Kabaddi: ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడితే ఎట్టుంటాదో తెలుసా?
గెలుపును డిసైడ్ చేసేవి వారి ఓట్లే..
హుజూరాబాద్ లో గెలుపు ఎవరిదనే అంశంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో తమకే అనుకూలంగా తీర్పు ఉండబోతోందని చెబుతోంది. కానీ కొన్ని సంస్థలు, బీజేపీ నిర్వహించిన సర్వేలో బీజేపీనే హుజూరాబాద్‌లో జెండా పాతబోతోందని అంటున్నాయి. అయితే ఈ సర్వేలన్నీ ఓటింగ్ సరళిని దగ్గరుండి గమనించిన వారు, ఓటేసిన ఓటర్లు చెప్పిన మాటల ఆధారంగానే వచ్చినవి. అయితే దాదాపు 10 నుంచి 12 శాతం ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామో చెప్పడానికి నిరాకరించారు. అయితే వారి ఓట్లే ఇప్పుడు కీలకం కానున్నాయి. హుజూరాబాద్ లో విజయం సాధించినా ఎవరికీ భారీ మెజారిటీ వచ్చే అవకాశం లేదు. అక్కడ పోటీ అంత హోరీ హోరీగా సాగింది. కేవలం కొన్నివేల ఓట్లే గెలుపును ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఆ పన్నెండు శాతం మంది ఓట్లు ఎవరికి వేశారనే దానిపైనే ఇప్పుడు హుజూరాబాద్ ఎవరిదనే అంశం ముడిపడి ఉంది. ఈ సస్పెన్స్‌కు తెరదించాలంటే ఇంకా ఒక రోజు వేచి చూడాల్సి ఉంటుంది.
Also Read: Sea sink to AP: ఏపీ సముద్రతీరం ముందుకొస్తోందా? ఊర్లు మునగడం ఖాయమా?