Amaravati: దేశ చిత్రపటంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని కాదంది. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. మూడున్నరేళ్లు దాటుతున్నా ఏర్పాటు చేయలేకపోయింది. సాంకేతిక సమస్యలను అధిగమించలేకపోయింది. అటు అమరావతిని అభివృద్ది చేయక.. ఇటు మూడు రాజధానులు ఏర్పాటుచేయక రాష్ట్రాన్ని నడి రోడ్డులో నిలబెట్టిన అపవాదును మాత్రం వైసీపీ సర్కారు మూటగట్టుకుంది. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించిన నాడు అందరూ స్వాగతించారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని ఎవరూ పట్టుబట్టలేదు. కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. విపక్ష నేతగా ఉన్న జగన్ అయితే ఒక అడుగు ముందుకేసి అమరావతి రాజధానికి ఇప్పుడున్న భూములు చాలవని.. మరింతగా సమీకరించాలని సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే వ్యక్తి అధికారం చేతిలోకి వచ్చేసరికి అమరావతి చేదు అయ్యింది. మూడు రాజధానులు ముచ్చటగా మారాయి. నాడు రాష్ట్రంలో మధ్యలో ఉన్న అమరావతిని అందరూ స్వాగతించారు. ఇప్పుడు కుల ముద్ర అంటగట్టి అమరావతిని అంతం చేయాలని చూస్తున్నారు.

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీపై అందరికీ జాలి, బాధ ఉంది. అన్నివర్గాల్లోనూ కూడా ఇది గూడు కట్టుకుంది. రాజకీయ దాడులు తట్టుకోలేక ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఆ మధ్యన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన హైకోర్టు న్యాయమూర్తి భట్టు దేవానంద్ ఏపీలో నెలకొన్న పరిస్థితులపై తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో మా పాప చదువుతోంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అంటూ స్నేహితులు ఆట పట్టిస్తున్నారంటూ బాధపడుతోంది’ అంటూ సభలోనే చెప్పుకొచ్చారు. ఏపీకి ఈ పరిస్థితి ఎందుకంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి సాధించుకోవడంలో తెలుగువారు ముందుంటారు అన్న ఖ్యాతిని సొంతం చేసుకున్నామని… కానీ మనం ఇప్పుడు ఏం సాధించామని.. రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉన్నామని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. జస్టిస్ దేవానంద్ తన బాధను వ్యక్తం చేస్తూ బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి కాబట్టి..ఆయన వ్యాఖ్యలు, బాధకు ప్రాధాన్యత దక్కింది. కానీ దాదాపు అన్నిరంగాల ప్రముఖుల్లో సైతం ఇదే భావన ఉంది. కానీ బయటపడితే రాజకీయాలు ముడిపెడతారని లోలోపల మాత్రం వారు బాధపడుతున్నారు.
రాష్ట్రానికి రాజధాని ఏదీ? ఈ పరిస్థితి రావడానికి కారణమెవరు? కారకులెవరు? అన్నది ఏపీ ప్రజలకే కాదు.. వివిధ దేశాల్లో స్తిరపడిన ఆంధ్రులందరికీ తెలుసు. రాజధాని లేకపోవడం అందరికీ బాధగా ఉంది. కానీ కొందరిలో మాత్రం ఇప్పటికీ మార్పు రావడం లేదు. కులం, మతం, ప్రాంతం, విద్వేష రాజకీయ మత్తులో ఇప్పటికీ ఒక వర్గం ప్రజలు ఉన్నారు. తామే ఏం ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకోలేని స్థితిలో వారున్నారు. సోషల్ మీడియా, రాజకీయ కుట్రలో సొంత రాజధానిపై కుల ముద్రలు వేసి అంతం చేసే పనిలో కొందరు ఉన్నారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు రాజధాని లేదన్న ఆవేదనలో ఉన్నా.. కొంతమంతి మాత్రం తమ వింతండ వాదనను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిగా నిర్ణయంచినప్పుడు ఒక్కరూ వ్యతిరేకించలేదు. 32 వేల ఎకరాల భూమిని సమీకరించినప్పుడు ఎందకంతా అని అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అంటే అధికారం మారిన ప్రతీసారి రాజధాని మారుతుందా? అంటే దానికి సమాధానం లేదు. మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయడం లేదు. న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారన్న ఆవేదన అందరిలోనూ ఉంది. కొందరు లోపల ఉంచుకోలేక బహిరంగ వేదికలో వెల్లడిస్తున్నారు. అయితే ఆవేదనను అర్ధం చేసుకొని అధికార పక్షం ఎదురుదాడి అనే ఆయుధంతో తిప్పికొడుతోంది. అయితే ఇది ఎంతకాలం చెల్లదు. జస్టిస్ భట్టు దేవానంద్ లాంటి అభిప్రాయం అన్నివర్గాల ప్రముఖుల్లో ఉంది. రాష్ట్రంపై బాధ్యతగా వ్యవహరించే ప్రతిఒక్కరిదీ అదే భావన. కానీ ఎదురు దాడుల సంస్కృతి, బూతుల మాటలకు భయపడి చాలా మంది సైలెంట్ గానే తమ బాధను దిగమింగుకుంటున్నారు.