Chandrababu Naidu: రాజకీయాల అన్నాక గెలుపోటములు ఉంటాయి. కానీ ఓటమిని గెలుపుగా మలుచుకోవడమే అసలు సిసలు రాజకీయం. ఈ విషయంలో చంద్రబాబు నాలుగు ఆకులు అధికంగానే చదివారు. సంక్షోభం ఎదురైన ప్రతిసారి దానిని సదావకాశంగా మలుచుకోవడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు. తాను ఒక పార్టీకి అధినేతగానే కాకుండా ఎదుటి పార్టీలను సైతం ప్రభావితం చేయగలరు. సైద్ధాంతిక విభేదాలతో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలను సైతం తనకు అనుకూలంగా మార్చగలిగిన నేత చంద్రబాబు. జాతీయస్థాయిలో విరుద్ధ భావాలు కలిగిన పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన చరిత్ర కూడా ఆయనదే.అయితే ప్రస్తుతం తన రాజకీయ ఉనికి కోసం ఎదుటి పార్టీలను ఒప్పించడంతో పాటు.. వారిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు.
తెలుగుదేశంతో జనసేన పొత్తును పవన్ ప్రకటించారు. సరిగ్గా చంద్రబాబు అవినీతి కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడే ఈ చర్యకు దిగారు. అంతటితో ఆగకుండా అదే పవన్ తో కీలక ప్రకటనలు చంద్రబాబు ఇప్పించారు. ఒక పార్టీ అధినేతగా పవన్ తన పార్టీ శ్రేణులకు ఒక పిలుపు ఇచ్చారు. టిడిపి తో పొత్తు విషయంలో ఎటువంటి ప్రకటన చేయవద్దని ఆదేశాలు ఇచ్చారు. అంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీకి ఏమైనా అంటే మీరు పార్టీని విడవచ్చని.. వైసిపి కోవర్టులని భావిస్తానని కూడా హెచ్చరించారు. పవన్ తో ఈ తరహా ప్రకటన చేయించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. తన చతురతను చూపించగలిగారు.
జాతీయస్థాయిలో భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు పప్పు నిప్పులా ఉంటాయి. కానీ ఏపీకి వచ్చేసరికి ఆ రెండు పార్టీలను తనకు అనుకూలం చేసుకోవడంలో చంద్రబాబు విజయవంతం అవుతున్నారు. టిడిపి జనసేన మధ్య పొత్తు కుదిరాయి. బిజెపి వస్తుందని ఆ రెండు పార్టీలు ఆశిస్తున్నాయి. అదే సమయంలో వామపక్షాలు సైతం బిజెపి లేకుంటే కలుస్తామని చెబుతున్నాయి. అలాగని తెలుగుదేశం, జనసేనకు వ్యతిరేకించడం లేదు.బిజెపి కాకుంటే కాంగ్రెస్, వామపక్షాలు… బిజెపితో బేరం కుదిరితే ఆ పార్టీతో టిడిపి, జనసేన జతకట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తాను ఎవరికి టార్గెట్ అవ్వకుండా చంద్రబాబు వ్యూహాలు రూపొందిస్తున్నారు.
ఎంతటి విపత్కాలన్నైనా ఎదుర్కోగల నేర్పరి చంద్రబాబు. 2009లో ప్రజారాజ్యం ఎంట్రీ తో టిడిపి పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. వరుసగా పది సంవత్సరాలు అధికారానికి దూరమైంది. అటువంటి సమయములోనే రాష్ట్ర విభజన అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. బిజెపికి స్నేహస్తం అందించారు. పవన్ మద్దతును పొందారు. విభజిత ఏపీకి తొలి సీఎంగా పగ్గాలు అందుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి రావాల్సిన అనివార్య పరిస్థితి. అందుకే ముందుగా జనసేన మద్దతు పొందారు. ఇప్పుడు బిజెపి, వామపక్షాలు, కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని రాజకీయాలు నడుపుతున్నారు. ఇందులో ఎవరో ఒకరు సాయం చేయక మానరు. చంద్రబాబు కూడా కావాల్సింది అదే. అందుకే అంటారు చంద్రబాబు రాజకీయ చాణుక్యుడు అని. అయితే కొన్నిసార్లు చంద్రబాబు వ్యూహాలు గురితప్పాయి. చాలాసార్లు ఫెయిల్ అయ్యాయి. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.