Dalit Girl: దేశానికి స్వాతంత్రం సిద్ధించి దశాబ్దాలు అవుతున్నా ఇంకా అంటరానితనం కొనసాగుతుండడం విచారకరం. దళితుల పట్ల వివక్ష చూపడం దారుణం. ఇప్పటికీ ఏదో ఒక చోట వారి పట్ల అమానుష ప్రవర్తన వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా ఏపీలోని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కరరావు అనే వ్యక్తి తన పదేళ్ల మనవరాలు శ్రీదేవిని కొద్దిరోజులుగా కాలు నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆ బాలికను భాస్కరరావు స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లాడు. అక్కడ విధుల్లో ఉన్న నర్సు మణికుమారి పరీక్షలు చేశారు. అయితే ఆమె చేతితో కాకుండా చిన్నారి కాలును తన కాలితో తొక్కి చికిత్స చేయకుండానే.. అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. నర్సు తీరుకు భాస్కరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల పట్ల ఇలా చిన్న చూపు చూస్తారా? అని ప్రశ్నించారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో ఆమె క్షమాపణ కోరింది.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో బయటకు వెలుగులోకి వచ్చింది. నర్సు తీరుపై ముప్పేట విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై అదే ఆసుపత్రిలోనే డాక్టర్ లికితనం వివరణ కోరగా… సదరు నర్సు డిప్యూటేషన్ పై ఆసుపత్రిలో పనిచేస్తోందని.. మరోసారి ఈ ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే వారు క్షమాపణ కోరడంతో ఆస్కరరావు తన మనవరాలిని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై ప్రజా సంఘాల నేతలు స్పందిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.