Pawan Kalyan: పవన్ బలమైన ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారు. వైసీపీతో ఈ రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిందని పవన్ భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి 20 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లిపోయిందని నమ్ముతున్నారు. అందుకే వైసిపి విముక్త ఏపీ కోసం ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందుకే తరచూ వైసిపిని ఓడించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా విశాఖకు చెందిన మైనారిటీ నాయకుడు సాధిక్, దర్శికి చెందిన గరికిపాటి వెంకట్ జనసేన లో చేరారు. వారికి సాదరంగా ఆహ్వానించిన పవన్ వైసిపి పై కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి తో పొత్తు విషయంలో సైతం చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తు విచ్చిన్నానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. చివరకు వైసీపీ పెద్ద ఎత్తున విషప్రచారం కూడా చేసింది. ఇప్పటికీ పొత్తు విఘాతం కలిగించడానికి, ఓట్లు, సీట్లుబదలాయింపు సక్రమంగా జరగకూడదని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో పవన్ తాజాగా చేసిన కామెంట్స్ వైసిపి ప్రయత్నాలను బలంగా అడ్డుకునేటట్టు ఉన్నాయి. టిడిపి తో జనసేన పొత్తు కనీసం ఓ దశాబ్ద కాలం పాటు ఉండాలనిపవన్ ఆకాంక్షించారు. అప్పుడే రాష్ట్ర విభజన ద్వారా జరిగిన నష్టాన్ని, వైసిపి పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమని చెప్పుకొచ్చారు.
వైసీపీ ఏలుబడిలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని.. దిక్కు లేకుండా పోయిందని… మైనారిటీ అనే పదంతో దూరంగా వెళ్లిపోవడం బాధేస్తుందని పవన్ చెప్పుకొచ్చారు. తనకు మతాలపై చాలా గౌరవం ఉందని.. నేను బిజెపితో ఉన్నా… మైనారిటీలకు నష్టం జరిగితే అండగా నిలబడతానని.. మత వివక్ష చూపించనని తేల్చేశారు. తాను పార్టీలకంటే మానవత్వాన్ని అమితంగా నమ్ముతానని కూడా చెప్పుకొచ్చారు. ఒక్కసారి జనసేనను నమ్మండి.. ముస్లింలను మైనారిటీ ఓటు బ్యాంకుగా చూడబోనని కూడా పవన్ హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాను పొత్తు పెట్టుకున్నానని.. రాష్ట్రం గాడిన పడాలంటే పొత్తు పది సంవత్సరాలపాటు కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి.