YCP: ఏపీ సీఎం జగన్ పవర్ ఫుల్ నాయకుడు. జాతీయస్థాయిలో డైనమిక్ లీడర్.అయితే ఈ గొప్ప నిర్వచనాలను అందుకునేందుకు జగన్ ఎంతోమంది నేతలను బలి పశువులు చేశారన్న కామెంట్స్ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆయనను అభిమానించే నాయకులు జగన్ లో అతనిని చూసుకున్నారు. ఆయన వెంట అడుగులు వేశారు. కొంతమంది ఏకంగా తమ పదవులను వదులుకున్నారు. జగన్ తోనే తమ రాజకీయ ప్రయాణం ఉంటుందని భావించారు. అయితే తొలినాళ్లలో నడిచిన నాయకుల్లో 80 శాతానికి పైగా ఇప్పుడు ఆయన వెంట లేరు.
తనకు అవసరం లేదనిపిస్తే ఎంతటి వారినైనా వదిలించుకునేందుకు జగన్ సిద్ధపడతారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అందుకు చక్కటి ఉదాహరణ. జగన్ మెట్టు కోసం చంద్రబాబు పైనే పెద్ద యుద్ధం చేశారు. వ్యక్తిగతంగాను కోర్టులో కేసులు వేశారు. కానీ అటువంటి వ్యక్తిని పూచిక పుల్లగా తీసి బయట పడేశారు. అయితే జగన్ నైజం గతంలోనూ బయటపడింది. ఉమ్మడి రాష్ట్రంలో కొండా సురేఖ, గోనె ప్రకాష్ రావు, కొణతాల రామకృష్ణ వంటి నాయకులను ఎలా వదులుకున్నారు అందరికీ తెలిసిందే. అయితే ఇలా వదులుకున్న నాయకుల్లో అప్పట్లో రెడ్డి సామాజిక వర్గం వారు లేరు. ఇప్పుడు ప్రమాదగంటికలు మోగడంతో రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం పక్కన పెట్టేందుకు జగన్ సిద్ధపడటం ఆయన నైజాన్ని తెలియజేస్తోంది.
ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా 11చోట్ల ఇన్చార్జిలను మార్చారు. మరో 90 మంది జాబితాలో ఉన్నారని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొస్తున్నారు. కేవలం విశ్వసనీయ సమాచారం అన్న మాదిరిగా మీడియాకు లీకులు ఇస్తున్నారు. దీంతో నీలి, కూల్ మీడియా రెచ్చిపోతుంది.పార్టీని, అధినేతను ఇబ్బంది పెట్టారని సాకుగా చూపి.. వారందరినీ తీసేస్తున్నారని ప్రచారం చేయడం ప్రారంభించింది. రెండో విడతగా పదిమంది మంత్రుల పేర్లను లీక్ చేశారు. వీరందరి వల్లే జగన్ రెడ్డి ఓడిపోబోతున్నారని చెప్పుకొస్తున్నారు. అయితే వీరిని మారుస్తారో లేదో కానీ.. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం వీరినే కారణంగా చూపబోతున్నామని సంకేతాలు మాత్రం ఇస్తున్నారు.
అయితే జగన్ రెడ్డి మార్కు రాజకీయం మరోసారి బయటపడింది. చాలామంది మంత్రులు, కీలక నాయకులను తప్పించినా వారు ఇంకో పార్టీకి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే స్క్రిప్టులు ఇప్పించి మరీ విపక్ష నేతలను బండబూతులు తిట్టించారు. రోజా అయినా, అంబటి రాంబాబు అయినా, వల్లభనేని వంశీ అయినా, మద్దాలి గిరి అయినా.. వారు వీరు అన్న తేడా లేకుండా అందర్నీ వైసీపీ హై కమాండ్ వాడేసింది. మిగతా రాజకీయ పక్షాలతో శత్రువులుగా మార్చేసింది. దీంతో వారికి మరో ఛాన్స్ లేదు. టిక్కెట్ వచ్చినా రాకున్నా విధిగా వైసీపీలో ఉండాల్సిందే. ఇప్పుడు అసలు విషయం గ్రహించిన ఆ నాయకులు బాధితులుగా మిగిలిపోవడంతో లోలోపల మదన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైసీపీలో పదవులు అయితే వచ్చాయి. పవర్ అనుభవించే ఛాన్స్ ఉందంటే? లేదనే సమాధానం వినిపిస్తోంది. తొలి క్యాబినెట్ మూడేళ్లు ఉంది. అందులో మంత్రులతో పాటు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. రెండో మంత్రివర్గంలో కూడా అదే స్థాయిలో డిప్యూటీ సీఎంలు కొనసాగారు. కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఆ డిప్యూటీ సీఎం ఎవరు కనిపించలేదు. కనిపించేదంత సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వారే. ప్రభుత్వ నిర్ణయాలైనా, పార్టీ పాలసీలు అయినా ఆయనే వెల్లడించేది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మంత్రులైన ప్రెస్ మీట్ లు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సోలో పెర్ఫార్మెన్స్. ఒక్క మంత్రి కైనా తమ శాఖ ప్రగతి గురించి చెప్పుకునే వీలు లేదు. కొందరైతే శాఖలను విడిచిపెట్టి బుగ్గ కారు, కాన్వాయ్ తో దర్పం ప్రదర్శిస్తుంటారు. తాము వెళ్లే రోడ్డులో గోతులు కూడా కప్పేందుకు నిధులు తెచ్చుకోలేని స్థితిలో చాలామంది మంత్రులు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల గురించి చెప్పనవసరం లేదు. అసలు సిసలు ఉత్సవ విగ్రహాలుగా వారిని మార్చేశారు.
ఎమ్మెల్యేలు, మంత్రులను నామమాత్రంగా మార్చి ప్రభుత్వంపై వ్యతిరేకతను వారిని బాధ్యులుగా చేయడం ఎంతవరకు సమంజసం. మొన్నటి వరకు తనను చూసి ఓట్లు వేశారన్న జగన్… ఇప్పుడు వ్యతిరేకతను కూడా తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మంచి జరిగితే తాను.. చెడు జరిగితే ఎమ్మెల్యేలు అన్న పరిస్థితుల్లో జగన్ ఉండడం అభద్రతా భావాన్ని తెలియజేస్తోంది. అస్పష్ట విధానాలతో ముందుకెళ్లిన జగన్ కు ఎన్నికల ముంగిటే ఓటమి భయం పట్టుకుంది. అయితే పార్టీలో 90 మంది అభ్యర్థులను మార్చుతూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని అనుకూల మీడియాలో రాయించుకుంటున్నారు . ఇన్నాళ్లు తిట్ల దండకాలతో ప్రత్యర్థులపై రెచ్చిపోమన్న నాయకులే.. మీరు వెనుకబడ్డారు, అసమర్థులు అన్న ముద్ర వేసి అదే నాయకులను పక్కన పెట్టేయాలని చూడడం నిజంగా జగన్నాటకమే. అంతకుమించి రాజకీయం ఏముంటుంది.