Telangana Ministry Green Signal: తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతర ప్రారంభించింది. తాజాగా విద్యాశాఖ తరుఫున ‘టెట్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో తెలంగాణలో తొలి నోటిఫికేషన్ విడుదలైంది.. ఇక కొలువుల భర్తీ ప్రక్రియ చేపట్టడమే తరువాయి. దీంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. మరో అడుగు ముందుకు పడినట్లు అయింది. నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్థం చేసుకున్నారు. ఇక పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

మొదటి దఫాలో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. దీంతో శాఖల వారీగా జీవోల జారీకి తయారవుతోంది. ప్రభుత్వం ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీలో వేగం పెంచడంతో నిరుద్యోగుల ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఇందులో పోలీస్ శాఖ, ఉపాధ్యాయ శాఖల్లో 13 వేల చొప్పున ఉద్యోగాల ఖాళీలుండటం గమనార్హం.
తెలంగాణ టెట్ మార్చి 26 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూన్ 12న టెట్ పరీక్ష జరుగుతుంది. పాఠశాల విద్యాశాఖలో 13086 కొలువులు భర్తీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 10వేల వరకూ ఉపాధ్యాయ కొలువులు ఉన్నాయి. అందులో ఎస్జీటీ కొలువులు 6700 వరకూ ఉన్నాయి. ఆదర్శ పాఠశాలల ఖాళీలు కలుపుకుంటే గరిష్టంగా 11వేల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.
నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగాల వరం ఇవ్వడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. చాలా కాలం తరువాత నోటిఫికేషన్ల పర్వం మొదలు కావడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోతోంది. కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ఒకే సమాధానం చెప్పి కేసీఆర్ తానేమిటో నిరూపించుకున్నారు.
ఆర్థిక శాఖ కూడా ఓకే చెప్పడంతో ఇక నోటిఫికేషన్లు వెలువడటమే మిగిలి ఉంది. మొత్తానికి తెలంగాణ సర్కారు ఉద్యోగాల భర్తీతో తనకున్న మైనస్ మార్కులను ప్లస్ చేసుకుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. రాబోయే ఎన్నికల్లో ఇదే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి లబ్ధి పొందేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారని తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ లకు ఏక కాలంలో బదులు ఇచ్చిన కేసీఆర్ కు ఇక ఎదురు లేకుండా పోతోంది. నిరుద్యోగుల అంశంతో ప్రయోజనం సాధించాలని చూస్తున్నట్లు సమాచారం.
[…] […]