Minister Taneti Vanitha: అధికార పార్టీలో ఆధిపత్య పోరు ఓ యువకుడుని బలి తీసుకుంది. సకాలంలో స్పందించకపోవడంతో హోం మంత్రి తానేటి వనిత సొంత పార్టీ శ్రేణుల నుంచే నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏకంగా గంటలపాటు రహదారిపై మంత్రిని నిలబెట్టి వైసీపీ శ్రేణులు నిరసన తెలపడం సంచలనం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో జరిగిన ఘటన.. అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీలోనే సెగలు పుట్టించడం విశేషం.
దొమ్మేరులో ఈనెల 6న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హోం మంత్రి అనిత హాజరయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసిపి నాయకులు నాగరాజు, సతీష్ లు ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఫ్లెక్సీలో వారి ముఖాలను ఎవరో కత్తిరించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు గ్రామానికి చెందిన బొంత మహేంద్ర అనే దళిత యువకుడు కారణమని అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో మహేంద్ర చిత్రహింసలు పెట్టడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి మహేంద్ర తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైసీపీకి సానుభూతిపరులు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారు. మంత్రి వనిత గెలుపునకు కృషి చేశారు. కానీ స్థానికంగా వైసిపి ఆధిపత్య పోరులో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహేంద్ర అరెస్ట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఎస్సై నాగభూషణంను కలిశారు. మంత్రి వనితతో ఫోన్ చేయిస్తే విడిచి పెడతానని ఎస్ఐ చెప్పారని బొంతా రాజేష్ చెబుతున్నాడు. ఆ అవమాన భారం భరించలేక మహేంద్ర పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.నా చావుకు కొవ్వూరు ఎస్సై భూషణం, వైసిపి నాయకులు నాగరాజు, సతీష్ లు మరణ వాంగ్మూలం ఇవ్వడం విశేషం.
అయితే మహేంద్ర మరణంతో మంత్రి వనిత స్పందించారు. మరో మంత్రి నేరుగా నాగార్జునతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నించారు. అయితే దీనిపై దొమ్మేరు ఎస్సి పేట వాసులు ఆందోళనకు దిగారు. మనుషులు మరణిస్తే తప్ప మీరు స్పందించరా అంటూ నిలదీశారు. గంటన్నర పాటు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో మంత్రులు వనిత, నాగార్జున రోడ్డుపై ఉండిపోవాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చి ఆందోళనకారులను తప్పించి మంత్రుల వాహనాలకు మార్గం చూపించారు. ప్రస్తుతం దొమ్మేరు ఎస్సీ పేట పోలీసుల ఆధీనంలో ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ శ్రేణుల నుంచి వనితకు నిరసన వ్యక్తం కావడం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇది ప్రభావం చూపడం ఖాయమని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.