Andhra Pradesh: ఏపీలో మరో అడ్డగోలు వ్యవహారం బయటపడింది. వైద్య ఆరోగ్యశాఖలో టెండర్లు ముందుగానే ‘ఫిక్సింగ్’ అయిపోతున్న విషయం బట్టబయలైంది. టెండరు దక్కిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ఇవ్వాల్సిన నోటిఫికేషన్.. టెండర్ ఫైనల్ కాకముందే ఓ కంపెనీ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. టెండర్లో పాల్గొన్న ఆ కంపెనీకి అధికారులు పక్కాగా హామీ ఇవ్వడం వల్లే ఆ కంపెనీ ఇలా ముందడుగు వేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు దాదాపు ఆరు నెలల క్రితం బయోమెడికల్ ఎక్యూ్‌పమెంట్ టెండర్లు ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాల నిర్వహణను ఓ కంపెనీకి అప్పగించేందుకు టెండర్ పిలిచారు.ఇప్పటి వరకూ మూడు సార్లు టెండర్లు పిలవడం, రద్దు చేయడం జరిగింది. నాలుగో సారి టెండర్ ప్రక్రియలో నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. అందులో రెండు కంపెనీలను టెక్నికల్ బిడ్‌లోనే అనర్హమైనవిగా తేల్చారు. మిగిలిన రెండు కంపెనీలకు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేశారు.
కానీ, ఇప్పటి వరకూ ఎల్-1 బిడ్డర్‌ను ఎంపిక చేయలేదు. ఆ రెండింట్లో ఒక కంపెనీ ఇతర రాష్ట్రాల్లోనూ బయోమెడికల్ ఎక్యూ్‌పమెంట్ నిర్వహణ చేస్తోంది. ఆ రాష్ట్రాల్లో ఆ కంపెనీపై అనేక అవినీతి ఆరోపణలున్న విషయం బయటపడటంతో మూడు వారాల క్రితం జరిగిన బీఎ్‌ఫసీలో ఎల్-1 కంపెనీని ఎంపిక చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. అయితే, ఆ కంపెనీతో అధికారులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకోవడంతో ఎలాగైనా ఆ కంపెనీనే ఎంపిక చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఏపీఎంఎ్‌సఐడీసీతో పాటు ఏపీవీవీపీ, డీఎంఈలోని కొంత మంది అధికారులకు భారీ ఎత్తున ముడుపులు అందాయన్న విమర్శలు వస్తున్నాయి.అయితే, ఇంత వరకు టెండర్ ఫైనల్ చేయలేదు. ఎల్-1 బిడ్డర్‌ను ఎంపిక చేయనూ లేదు. అయినా, అధికారుల నుంచి పక్కా హామీ లభించడంతో ఆ కంపెనీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేసేందుకు మొగ్గు చూపే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ కంపెనీ ఫేస్‌బుక్‌లో ఆ నోటిఫికేషన్‌ను ఉంచింది. ప్రాజెక్ట్ మేనేజన్, జోనల్ మేనేజర్, డివిజనల్ మేనేజర్, జిల్లా ఇన్‌చార్జి, జూనియర్ బయోమెడికల్ ఇంజనీర్, స్పెషలిస్ట్ ఇన్‌చార్జి, సర్వీస్ కో-ఆర్డినేటర్ ఇలా మొత్తం ఏడు పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆరోగ్యశాఖ అధికారులు ముందుగానే కంపెనీకి సమాచారం ఇవ్వడంతోనే రెండు రోజుల ముందే కంపెనీ ప్రతినిధులు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారని అంటున్నారు. బయోమెడికల్ ఎక్యూ్‌పమెంట్ టెండర్ల విషయంలో గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.

వందల కోట్లకు టెండర్..
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులన్నింటిలో దాదాపు రూ.560 కోట్ల విలువైన పరికరాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇవి మరమ్మతులకు గురైతే, తక్కువ ధరకు బాగు చేసి, మళ్లీ పని చేసే స్థితికి తీసుకువచ్చే బాధ్యతను ఈ కంపెనీకి అప్పగిస్తారు. టెండర్ పిలిచినప్పుడు ఐదేళ్ల కాల వ్యవధికి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. టెండర్ విలువ ఏడాదికి రూ.45 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఎల్1 కంపెనీకి ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు ఇస్తారు. ఆ తర్వాత నిర్వహణ సంస్థ పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తారు. మొత్తంగా ఏడేళ్లకుగాను టెండర్ విలువ రూ.315 కోట్లు ఉంటుంది. ఇంత భారీ ప్రాజెక్టును ఇతర రాష్ట్రాల్లో తీవ్ర వివాదాలు ఎదుర్కొంటున్న కంపెనీకి కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయి. ఏపీఎంఎ్‌సఐడీసీలోని కీలకమైన అధికారులు తెర వెనుక వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం. కంపెనీని ఎంపిక చేసిన సమాచారం ఏపీఎంఎ్‌సఐడీసీ నుంచి మాత్రమే కంపెనీకి తెలుస్తుంది. దీనిలో భాగంగానే కంపెనీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శలు వస్తున్నాయి.

ముందే నిర్ణయం
టెండరు కట్టబెట్టే కంపెనీకి అధికారులు ముందుగానే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేయడం, ఆ తర్వాత టెండర్లు ఆహ్వానించడం, టెక్నికల్ బిడ్, ఫైనాన్షియ ల్ బిడ్ అంటూ హడావుడి చేయడం ఆరోగ్యశాఖ లో పరిపాటిగా మారింది. సదరు కంపెనీ అర్హత సాధించే వరకూ టెండర్ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. పోటీకి ఏదైనా కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. పోటీ నుంచి తప్పుకునే వరకూ ఎలాంటి కారణం చూపించకుండానే టెండర్లు రద్దు చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి.