Homeజాతీయ వార్తలుTS Election Results 2023: పొంగులేటి చెప్పినట్టే ఖమ్మంలో పదికి పది కాంగ్రెస్ వే!

TS Election Results 2023: పొంగులేటి చెప్పినట్టే ఖమ్మంలో పదికి పది కాంగ్రెస్ వే!

TS Election Results 2023: ఈసారి ఖమ్మం జిల్లాలో అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఆ మధ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శపథం చేశారు. అది ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతుండడమే ఇందుకు నిదర్శనం గా కనిపిస్తోంది. పాలేరు అసెంబ్లీ నియోజవర్గంలో స్వయంగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ప్రత్యర్థి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి మీద ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తన సమీప భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ మీద ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అశ్వరావుపేట కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ తన సమీప భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు మీద లీడ్ లో ఉన్నారు. ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య భారత రాష్ట్ర సమితి అభ్యర్థి హరి ప్రియ మీద లీడ్ లో ఉన్నారు. పినపాకలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రేగా కాంతారావు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మట్టరాగమయి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య మీద లీడ్ లో ఉన్నారు. భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరయ్య అక్కడి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి వెంకట్రావు మీద లీడ్ లో ఉన్నారు. వైరాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్ తన సమీప భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మదన్ లాల్ మీద లీడ్ లో ఉన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అక్కడి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు మీద ఆధిక్యంలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దూకుడు కొనసాగిస్తుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అధికార పార్టీ తప్పిదాలు

వాస్తవానికి భారత రాష్ట్ర సమితికి ఈ జిల్లాలో పెద్దగా బలం లేదు. 2014, 2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, టిడిపి, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి తనలో చేర్చుకుంది. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ ఈ లోగానే ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఈ జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పెత్తనం పెరిగిపోవడంతో మిగతా సీనియర్లు పొసగలేకపోయారు. అధిష్టానానికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో వారంతా కూడా బయటకు వచ్చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆ పార్టీ అనూహ్యంగా బలం పెంచుకుంది.

శ్రీనివాసరెడ్డి శపథం చేశారు

ఇక అధికార పార్టీలో తమకు అడుగడుగునా అవమానాలు జరగడంతో బయటకు వచ్చామని చెప్పిన శ్రీనివాస్ రెడ్డి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అప్పట్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఏకంగా అసెంబ్లీ స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించారు. అంతేకాదు ఉమ్మడి జిల్లాలో ఒక్క భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథం చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి.. ప్రచార కమిటీ కో చైర్మన్ అయ్యారు. తనకున్న పరిచయాల ద్వారా డీకే శివకుమార్ ను కలిశారు. తన అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. తన నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించారు. ఇప్పుడు తాను శపథం చేసినట్టుగానే ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు దిశలో పయనింపజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం భారత రాష్ట్ర సమితిలో ఇబ్బందికరంగా మారింది. ఇక భారత రాష్ట్ర సమితి నుంచి ఈ జిల్లాలో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు ఓటమి దిశలో ఉన్నారు. వారిలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి వంటి వారు ఉండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular