TDP: ఏపీలో అధికార వైసీపీని ఎదుర్కొనేందుకుగాను ప్రతిపక్ష టీడీపీ క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన టీడీపీ.. ఈ సారి వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీనివ్వడమే కాదు.. వైసీపీని గద్దె దించాలని అనుకుంటున్నది. అందుకు కావాల్సిన ప్లాన్స్ రచించుకుంటున్నది. కాగా, సీఎం జగన్, వైసీపీని టార్గెట్ చేయడంలో ఏ విషయం ఎత్తుకోవాలనే విషయంలో తడబడుతోంది. టీడీపీ ఇలానే వ్యవహరిస్తే కనుక ఈ సారి ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాలు తగ్గొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీడీపీ నేతలు మొన్నటి వరకు క్యాసినో అంశం ఎత్తుకున్నారు. కాగా, ఆ విషయం అలా ఉన్న నేపథ్యంలోనే పీఆర్సీ ఫైట్ షురూ అయింది. ఉద్యోగులు,సర్కారు మధ్య ఫైట్ నడుస్తూనే ఉండగా, చర్చలు సఫలమై ఉద్యోగ నేతలు సమ్మె నుంచి తప్పుకున్నారు. ఈ విషయంలో రాజకీయం చేయాలని అనుకుంటుండగా, తాము సర్కారుతో సమస్యలు పరిష్కరించుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. అలా టీడీపీకి సరైన అస్త్రం అయితే దొరకడం లేదు.
మరో వైపున రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బలోపేతం కోసం కృషి జరగాలనేది అధిష్టానం ఆలోచన. కానీ, ఆ దిశగా పనులు కాని కృషి కాని జరగడం లేదనే వాదన టీడీపీ వర్గాల నుంచి వస్తుందని తెలుస్తోంది. ఏ అంశంపై మాట్లాడాలనే విషయమై టీడీపీ నేతలకే తెలియడం లేదని, దాంతో పార్టీ కేడర్ లో నూతన ఉత్తేజం కనబడటం లేదని సమాచారం. ఇకపోతే కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడం, స్కూల్స్ రీ ఓపెనింగ్, స్కూల్స్ లో మౌలిక వసతుల కల్పన వంటి విషయాలు ఏపీ సర్కారుకే అడ్వాంటేజ్ గా ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని విమర్శించే పరిస్థితులు అయితే కనబడటం లేదు.
ఇకపోతే టీడీపీ రాష్ట్రస్థాయి నేతలు కూడా రాష్ట్ర స్థాయి అంశాలపైన కాకుండా తమ సొంత నియోజకవర్గంలో స్థానికంగా ఉండే సమస్యలపైనే ఫోకస్ చేస్తున్నారు. సోమిరెడ్డితో పాటు ఇతర ఆ పార్టీ నేతలు తమ నియోజకవర్గంలోని సమస్యలపైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇక ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన సొంత నియోజకవర్గంపైనే కాన్సంట్రేట్ చేస్తున్నాడు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అవసరమైతే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని ప్రకటించారు. అలా ఎవరి సొంత ఎజెండా ప్రకారం వారు తమ ప్రాంతాల్లోనే టీడీపీ నేతలు ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి వ్యూహాల్లో మార్పులు అవసరమని సూచిస్తున్నారు.