ఏపీలో సీఎం జగన్ కొలువుదీరాక ఆదిలో హిందుత్వంను అవమానించారని.. దేవాలయాలపై దాడులు జరిగాయని పెద్దరచ్చ జరిగింది. తిరుమలలో అన్యమత ప్రచారం దుమారం రేపింది. ఏపీలో క్రిస్టియానిటీని బీజేపీ నేతలు ఎత్తిచూపి విమర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదంలో ఏపీ ప్రభుత్వం చిక్కుకుంది.
తెలుగు అకాడమీ పేరు మార్పుపై ఏపీలోని రాజకీయ పార్టీలు, జనసేనాని పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. తెలుగు అకాడమీ పేరును ‘తెలుగు-సంస్కృత అకాడమీ’గా పేరు మారుస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి.గతంలోనే ఇంగ్లీష్ మీడియాలో విద్యాబోధన చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వంను తెలుగును చంపేస్తున్నారని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ఇప్పుడు తెలుగు అకాడమీ పేరు మార్పుపై భగ్గుమన్నాయి.
ముందుగా జనసేనాని పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. తెలుగు అకాడమీ పేరు మార్పును తెలుగు భాషాభిమానులను నిరుత్సాహ పరుస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగు భాష అభివృద్ధి, వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడమీ అస్తిత్వాన్ని దూరం చేసేలా పేరు మార్చారని ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలుగు -సంస్కృత అకాడమీ అని ఎందుకు ఇంత హడావుడిగా పేరు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం , అకాడమీ బాధ్యులు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేరు మార్చడం ద్వారా సాధించే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
ఇక టీడీపీ నేత మండలి బుద్దప్రసాద్ అయితే మండిపడ్డారు. తెలుగు అకాడమీ పేరు మార్చడం విచారకరమని.. తెలుగును అంతం చేయడానికే పుట్టారా? అని నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు అకాడమీకి రావాల్సిన నిధులు రప్పించలేకపోయారని విమర్శించారు. తెలుగు మీడియంను జగన్ రద్దు చేశారని.. ఇప్పుడు తెలుగు అకాడమీ పేరు మార్చడం దారుణం అని మండిపడ్డారు.