https://oktelugu.com/

Khammam Politics: టార్గెట్ పొంగులేటి.. రంగంలోకి హరీష్ రావు.. బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ కీలక నేత

గతంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరకముందు ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలకు తన వర్గంలోని పలువురి పేర్లు ప్రకటించారు. భద్రాచలానికి తెల్లం వెంకట్రావు పేరును అప్పట్లో ఆయన ప్రకటించారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 17, 2023 / 12:53 PM IST

    Khammam Politics

    Follow us on

    Khammam Politics: భారత రాష్ట్ర సమితి అధినాయకత్వాన్ని విభేదించి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని అధికార పార్టీ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శ్రీనివాస్ రెడ్డి శపధం చేసిన నేపథ్యం లో భారత రాష్ట్ర సమితి దీనిని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే శ్రీనివాసరెడ్డి వర్గంలోని నాయకులపై అధికార పార్టీ ఆకర్ష్ ప్రయోగాన్ని చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కొంతమంది నాయకులతో కెసిఆర్ సూచనల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చర్చలు జరుపుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కొంతమంది నాయకులు ఇప్పటికే భారత రాష్ట్ర సమితి ఫోల్డ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 2014, 2018 ఎన్నికల ఫలితాలు దానిని నిరూపించాయి. తర్వాత మారిన రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీలో గెలిచినవారు భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు. ఇందులో పొంగులేటి కూడా ఒకరు. 2019 ఎన్నికల్లో ఆయనకు భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం టికెట్ ఇవ్వకపోవడం అప్పటినుంచి నారాజ్ గా ఉన్నారు. తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రచార కమిటీ కో_ చైర్మన్ గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

    గతంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరకముందు ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలకు తన వర్గంలోని పలువురి పేర్లు ప్రకటించారు. భద్రాచలానికి తెల్లం వెంకట్రావు పేరును అప్పట్లో ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనతో పాటు వెంకటరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే అప్పట్లో పొంగులేటి అనుచరులకు టికెట్లు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ టికెట్ విషయం ఎటూ తేల్చకపోవడంతో వెంకట్రావు శ్రీనివాసరెడ్డి మీద నారాజ్ గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిని పసిగట్టిన భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం వెంటనే రంగంలోకి దిగింది. ఈ వ్యవహారాన్ని నడిపే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించింది.

    ఈ నేపథ్యంలో హరీష్ రావు నేరుగా వెంకట్రావుకు ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే బుధవారం రాత్రి ఆయన ప్రగతి భవన్ వెళ్లడం కూడా ఇందుకు బలం చేకూర్చుతోంది. గురువారం ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరడం ఖాయమని ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే ఆయన మనసు మార్చడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిసిసిబి సభ్యుడు తూళ్ళూరి బ్రహ్మయ్యను రంగంలోకి దింపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. టికెట్ విషయం తేల్చకపోవడం వల్లే తాను భారత రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నానని వెంకట్రావు అంటున్నారు. తనకు టికెట్ ఇస్తామని భారత రాష్ట్ర సమితి హామీ ఇచ్చిందని, భద్రాచలం చుట్టూ 25 కోట్లతో కరకట్ట నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని వెంకట్రావు అంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో బలంగా ఉన్న పొంగులేటిని దెబ్బతీయడానికే భారత రాష్ట్ర ఈ విధంగా కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి..