AP Liquor Policy: మందుబాబులకు శుభవార్త. ఏపీలో ఇక అన్ని మద్యం బ్రాండ్లు దొరకనున్నాయి. ప్రైవేటు మద్యం దుకాణాల కు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనన్నట్లు సమాచారం. ఈ మేరకు కొత్త మద్యం పాలసీలో కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిధులు సమస్య వెంటాడుతుండడంతో మందుబాబులను మరింత పిండుకోవడం కోసం మళ్లీ దుకాణాలను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకు ఉన్న మద్యం పాలసీని మార్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వమే సొంతంగా షాపుల నిర్వహణకు ముందుకొచ్చింది. అటు మద్యం ధరలను సైతం అమాంతం పెంచేసింది. గతంలో ఎన్నడూ చూడని, వినని మద్యం బ్రాండ్లను విక్రయించింది.మద్యం ద్వారా ఎంత దోపిడీకి పాల్పడాలో.. అంతలా పిండేసింది. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో ప్రైవేటు దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చూస్తోంది.
ఎన్నికలకు ముందు నవరత్నాల పేరిట జగన్ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మడత పేచీ వేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపనున్నట్లు ప్రకటించారు.ఏటా 25 శాతం షాపులను ఎత్తివేస్తామని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల నాటికి మద్యం అనేది ఫైవ్ స్టార్ హోటల్ కే పరిమితం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో సాధ్యం కాలేదు. ఎవరైనా మద్యపాన నిషేధం గురించి ప్రస్తావిస్తే.. పేదలకు సంక్షేమ పథకాలు అడ్డుకున్నారన్న రేంజ్ లో సమాధానాలు చెబుతున్నారు.ఇప్పుడు ఏకంగా వేలం వేసి ఆదాయం సమకూర్చుకునేందుకు జగన్ సర్కార్ సిద్ధపడుతోంది.
ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ అక్టోబర్ ఒకటి నాటికి ముగుస్తుంది. అదే పాలసీని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వాలి. అయితే ఇంతలో ప్రభుత్వ దుకాణాలకు సంబంధించి ఒక నివేదికను తయారు చేశారు. కేవలం డిపాజిట్ల సేకరణ ద్వారానే రెండున్నర వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేశారు. ఇది ప్రభుత్వ పెద్దలతో పాటు సీఎం జగన్ను ఆకట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం దాదాపు ప్రైవేటు మద్యం దుకాణాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
వచ్చేనెల వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే మద్యం పాలసీ మార్పు బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది. దీనిని మద్యం ఆదాయంతో అధిగమించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అప్పుడే ఎన్నికల వరకు సంక్షేమ పథకాలను సజావుగా అందించగలమని.. లేకుంటే నిధుల సమీకరణ కష్టమని ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. దీనిపై అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో క్లారిటీ రానుంది.