దేశ వృద్ధి రేటు బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు 2014-15 నుంచి తగ్గుతూ వస్తోందని చెప్పారు. బంగ్లాదేశ్ వృద్ధిరేటు పెరుగుతూ పోతోందని గుర్తు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై అవగాహన లేక మాట్లాడుతున్నారని అన్నారు. గణాంకాలు చూస్తుంటే అందరికి అర్థమైపోతున్నా వారికి ఎందుకు అర్థం కావడం లేదో తెలియడం లేదన్నారు.
గ్యాస్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ కేంద్రం చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. జీడీపీలో తెలంగాణ కంటే వెనుకబడి ఉన్న దేశ తలసరి ఆదాయం రూ. 1,28,829 గా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,37,632 గా ఉందని చెప్పారు. రాష్ర్టం ఏర్పడినప్పుడు 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఈ లెక్కలు చూస్తుంటే ఏం అర్థమవుతోందని ప్రశ్నించారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే రీతిలో లెక్కలు ఉండగా నాయకులకు కనిపించడం లేదా అని పేర్కొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఉన్నంత కాలం ఆయనే సీఎంగా ఉంటారని అన్నారు. మిగతా పార్టీలు రెండో స్థానం కోసం కొట్టాడుకోవడమే అని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండో స్థానం విషయంలో ఇప్పటికే గొడవలు పడుతున్నాయని గుర్తు చేశారు. టీఆర్ఎస్ మాత్రం మొదటిస్థానంలోనే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణల కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ, కాంగ్రెస్ వాదులాడుకుంటున్నాయని అన్నారు.