Telangana Word: ‘ఓకూన్ సమయా తిలంగాణ దేసటోన్ మొన్ సమొన్ కౌ సా..’
ఇది ఓ జోలపాట. మయన్మార్ దేశంలో పాడతారు. ఇందులో ‘తెలంగాణ’ పదం కనిపిస్తుంది. ఇది దాదాపు ఐదో శతాబ్దం నుంచే ప్రాచుర్యంలో ఉంది. ఈ పూర్తి జోలపాటకు అర్థం
‘ఓ కొడుకా, మన నేల తిలంగాణ..
మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే,
మనం పడవల్లో తూర్పు దిక్కున ఉన్న ఈ సువర్ణ భూమికి వచ్చాం..’
చరిత్ర పరిశోధకురాలు, సీనియర్ జర్నలిస్టు డీపీ అనురాధ రచించిన ‘జగము నేలిన తెలుగు’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ జోలపాట ’మన్’ భాషలో సాగుతుంది. దీనికి ఆమె తెలుగు అనువాదం చేశారు. ‘మన్’ సాహిత్యం, భాష, సంస్కతి, చరిత్రపై పరిశోధన చేస్తున్నప్పుడు, ‘తిలంగాణ’ అనే పదం కనిపించినట్లు అనురాధ తెలిపారు.
ఐదు దశాబ్దంలోనే..
క్రీ.శ. ఐదో శతాబ్దం నుంచే ఈ పాట మియన్మార్‌లో ప్రచారంలో ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. అంటే, అంతకుముందే ప్రజలు అక్కడికి వలస వెళ్లి ఉంటారని అంచనా.. కానీ, తాము చైనా నుంచి వలస వచ్చినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటారు. ‘తెలంగాణ’ అనే పదం కేవలం గోదావరి నదీ పరివాహ ప్రాంతానికే పరిమితం కాకుండా, ’మన్’ సాహిత్యంలోనూ కొన్ని శతాబ్దాలుగా వినిపిస్తోంది, కనిపిస్తోందని దీన్నిబట్టి తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. పదో వసంతంలోకి అడుగు పెడుతోంది. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ అంటే ఏమిటి? ఈ పదానికి పుట్టుక ఎక్కడ అని తెలుసుకుందాం.
భిన్న కథనాలు..
తెలంగాణ అనే పదంపై శాసనాలు, సంస్కృతి ఆధారంగా భిన్న కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పటివరకు లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం..
తెల్లాపూర్ శాసనమే మొదటిదా..?
ఒక చరిత్రకు సంబంధించి ఆనవాళ్లను శాసనాలు తెలియజేస్తాయి. గతంలో పాలించిన రాజులు, వారి ఆస్థానంలో పనిచేసేవారు, సామంతులు వేయించిన శాసనాల ఆధారంగా చరిత్ర మనకు వెలుగులోకి వస్తుంటుంది. అదే కోవలో తెలంగాణ పదం పుట్టుకకు సంబంధించిన చరిత్రను కొన్ని శాసనాల ఆధారంగా చెబుతున్నారు చరిత్రకారులు. ఈ విషయంలో మనకు అందుబాటులో ఉన్నది తెల్లాపూర్ శాసనం. హైదరాబాద్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తెల్లాపూర్ గ్రామం మధ్యలో ఈ శాసనం కనిపిస్తుంది. అందులో ‘తెలుంగణపురం’ అని రాసి ఉంది. దీన్ని విశ్వకర్మ వంశస్థులు నాగోజు, అయ్యలోజు, వల్లభోజులు వేయించినట్లు శాసనం చెబుతోంది. 24 లైన్లలో ఈ శాసనం ఉంది. ఇందులోని 13వ లైనులో ‘తెలుంగణపురం’ అనే పదం ఉంది. దీన్ని 1418 సంవత్సరం జనవరి 8న వేయించినట్లుగా శాసనంపై ఉంది.
శ్రీరంగంలోని తామ్రపత్రం..
శ్రీరంగంలోని తామ్రపత్రంలో తెలంగాణ ప్రస్తావన
తెల్లాపూర్ శాసనం కంటే ముందుగానే శ్రీరంగంలో లభించిన తామ్రపత్రంలో తెలంగాణ పదాల ప్రస్తావన ఉందని చరిత్రకారులు చెబుతున్నమాట. దీనిపై ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. తెల్లాపూర్ శాసనం కంటే 60 ఏళ్లకు ముందే శ్రీరంగంలో వేయించిన తామ్రపత్రంలో తెలంగాణ ప్రస్తావన ఉంది. ముసునూరి నాయకుడైన కాపయ నాయకుడి అల్లుడు ముప్ప నాయకుడు 1358లో ఈ తామ్రపత్రం రాయించారు. ఇది శ్రీరంగంలోని రంగనాయకులు ఆలయంలో లభించింది. ఆరు రాగి రేకులపై ఈ శాసనం రాసి ఉంది. మొదటి రేకులో మొదటి వైపు 8, 10 పంక్తులలో ‘తిలింగణామా, తిలింగాణా’ అని పదాలు ఉన్నాయి. ఈ రెండు పదాలు ఒక దేశాన్ని సూచించేలా ఉన్నాయి. తిలింగ అంటే తెలుగు, ఆణెము అంటే దేశము లేదా ప్రాంతం. తెలుగు, ఆణెము కలిసి తిలింగాణ అయింది. రాను రాను వాడుక భాషలో తెలంగాణగా మారిందని చెప్పవచ్చు. ఈ శాసనంలో ముప్పనాయకుడు దానం చేసిన ప్రాంతాల పేర్లు ఎక్కువగా ఉంది. ఇందులో సరిహద్దులు చెబుతూ, ఈ దేశంలో ఆ గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో శ్రీరంగం అంతర్భాగంగా ఉండేది. అప్పట్లో ఒక దేశంగా ఉండే భూభాగాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీరంగంలో రాయించారని చెప్పవచ్చు. తెల్లాపూర్‌లో 1418లో వేయించిన శాసనంలో మధ్యలో ఒక చోట ‘తెలుంగాణపురాన’ అని ఉంది. ఇది ఫిరోజ్ షా కాలం నాటిది. ఫిరోజ్ షా భార్యకు బంగారు గాజుండల గొలుసును పోచోజు, నాగోజు, మల్లోజు, అయ్యలోజు చేయించి కానుకగా ఇచ్చారని శాసనం చెబుతోంది. తెలంగాణలో ఇది గ్రామాన్ని సూచించే విధంగా ఉంది. తర్వాత కాలంలో తెలుంగాణపురమే తెల్లాపూర్‌గా మారి ఉండవచ్చు.
గోదావరి పేరు నుంచి పుట్టుక..
14, 15వ శతాబ్దాలకు చెందిన శాసనాలలో తెలంగాణను పోలిన పదాలున్నాయి. కేవలం శాసనాల పరంగానే కాకుండా సంస్కృతి ఆధారంగానూ తెలంగాణ పదం పుట్టిందని మరికొందరు చరిత్రకారులు చెప్పేమాట. ప్రముఖ చరిత్రకారుడు, తెలుగు పండితుడు సంగంభట్ల నర్సయ్య రాసిన ‘తెలివాహ గోదావరి’ పుస్తకంలో తెలంగాణ పదం పుట్టుకకు, సంస్కృతి ఏ విధంగా కారణమైందో వివరించారు. గోదావరి నది మధ్య ప్రాంతంలో తెలంగాణ సంస్కృతికి బీజం పడింది. గోదావరి నదికి ’తెలివాహ’ అనే పేరు ఉంది. తెలివాహ నది ఒడ్డున మొదలైన జాతి కావడంతో తెలింగాణ.. కాలక్రమంలో తెలంగాణగా మారిందని సంగంభట్ల నర్సయ్య చెబుతున్నారు. దీనిపై బీబీసీతో ఆయన మాట్లాడారు.
‘ఒక జాతి పుట్టక రెండు, మూడు వేల కిందటే మొదలవుతుంది. తెలంగాణకు క్రీ.శ. ఒకటో శతాబ్దంలోనే బీజం పడింది. తెలివాహ నదితో తడిచిన నేల ఇది. సాధారణంగా తడిచిన నేలను ‘మాగాణి’ అంటాం. తెలి, మాగాణం.. ఈ రెండు పదాలు కలిపి తెలింగాణగా మారింది. రెండు పదాలు కలిసినప్పుడు ‘మ’కారం సున్నాగా మారుతుంది. అంతేకాదు, తెలింగాణలో మాట్లాడే భాష కాబట్టి తెలుంగు భాష.. తర్వాత తెలుగు భాషగా మారింది.’ అని సంగంభట్ల నర్సయ్య వెల్లడించారు. ఈ విషయంలో ఎంతో పరిశోధన చేసిన తర్వాత ‘తెలివాహ గోదావరి’ పేరిట పుస్తకం రచించినట్లు చెప్పారు.
సాహిత్యంలో ప్రస్తావన..
సాహిత్యంలోనూ తెలంగాణ పదాన్ని పోలిన ప్రస్తావన కనిపిస్తుందని మరో చరిత్రకారుడు డి.సూర్యనారాయణ తెలిపారు. 11వ శతాబ్దంలో కేతన రాసిన దశకుమార చరిత్ర అనే పుస్తకంలో తెలంగాణ పదాన్ని పోలిన ప్రస్తావన ఉంది. ఇందులో ‘తెలుంగరాయ’ అనే పదం వాడారు. అంటే తెలుగు రాజు అని అర్థం చెప్పవచ్చు. అంతేకాదు, తెలింగాణ అనే పదాన్ని గియాసుద్దీన్ తుగ్లక్ వాడారు. 1323లో వచ్చిన నాణేలపై ఇది కనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్నా, ఆ పదం పుట్టుక ఎన్నో వందల ఏళ్ల కిందటే జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Telangana where did this word originate and why is it heard in a myanmar jola song
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com