BRS: కాళేశ్వరమే ఇంకా పూర్తి కాలేదు.. నేల విడిచి ఈ జల విన్యాసం ఏమిటో?

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఫలితంగా, ఈ ప్రాజెక్టు న్యాయ వివాదాల్లోకి జారుకుంది.

Written By: Bhaskar, Updated On : October 13, 2023 12:20 pm

BRS

Follow us on

BRS: తెలంగాణ ఒకప్పుడు సిరిసంపదలతో తులతూగిన ప్రాంతం కాదా? కాకతీయుల నుంచి నిన్న మొన్న పాలించిన వారి వరకు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదా? కాలేశ్వరం నిర్మించిన దగ్గర నుంచే తెలంగాణ వ్యవసాయం చేసుడు మొదలుపెట్టిందా? భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి తెలిసిందా? అంటే ఔను అని డబ్బా కొట్టుకుంటున్నాయి భారత రాష్ట్ర సమితి వర్గాలు. నవాబ్ది దశాబ్ది వేడుకలు చేసుకుంటూ.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు 21 రోజులపాటు వేడుకలు చేసుకుంటూ.. గోరంత చేస్తే కొండంత ప్రచారం చేసుకుంటూ.. మాయ చేస్తున్నాయి భారత రాష్ట్ర సమితి వర్గాలు. వీటిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు రాజస్థాన్ లాగ ఉండేదని, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే పచ్చని అడ్డం పొడుగు లేని మాటలు మాట్లాడుతున్నాయి. అంతేకాదు పూర్తికాని కాలేశ్వరం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కిన్నెరసాని ప్రాజెక్టు వరకు.. అన్నింటిని తమ సొంత ఖాతాలో వేసుకుంటున్నాయి.

గోస తీరలేదు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అయింది. ఉద్యమ సమయంలో సబ్బండ వర్ణాల నినాదమైన ‘నీళ్లు, నిధులు, నియామకా’ల్లో నీటి గోస ఇప్పటికీ పూర్తిగా తీరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అప్పట్లో కేసీఆర్‌ ప్రకటించారు. కానీ, కాళేశ్వరం ఎత్తిపోతలు మినహా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. గతానికి భిన్నంగా.. అవసరానికి మించి సమృద్ధిగా వర్షాలు కురవడం.. చెరువులు నిండడంతో సాగునీటికి సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురవడం లేదు. కానీ, ఉద్యమ నినాదమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రక్రియ మాత్రం నత్తనడకనే సాగుతోంది. తొమ్మిదేళ్లలోనే సాగునీటి గోస తీరిపోయిందని ప్రభుత్వం ప్రకటించుకుంది. అయినా, ఏడేళ్లలో పెండింగులో ఉన్న కల్వకుర్తి, రాజీవ్‌ బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెంవాగు, కుమ్రం భీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథపూర్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేశామని, తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదలుపెట్టి కాళేశ్వరం, చనాకా కొరాట బరాజ్‌, సమ్మక్క, సారక్క బరాజ్‌, భక్త రామదాసు, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పూర్తి చేశామని అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రభుత్వం తన ప్రచార ప్రకటనల్లో ఘనంగా ప్రకటించుకుంది.

ఏం ఒన గూరింది?

నిజానికి, పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపు 70 శాతం పూర్తయింది. మిగిలిన 30 శాతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏడేళ్లలో పూర్తి చేసింది కేవలం 15 శాతం లోపే. బిల్లులు చెల్లించకపోవడం, ప్రాజెక్టుపై దృష్టి సారించకపోవడంతో ముందుకు సాగలేదు. దీని ద్వారా 4.38 లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదిస్తే.. ఇప్పటి వరకూ కేవలం 3.07 లక్షల ఎకరాలకే నీరందింది. మరో 1.31 లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉంది. కల్వకుర్తి నియోజకవర్గానికి నీరందించే డి-82 కాల్వ పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, రాజీవ్‌ బీమా ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇంతే. రిజర్వాయర్లు, పంప్‌ హౌజ్‌లు తదితరాలకు సంబంధించి 80 శాతం పనులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. తొమ్మిదేళ్లు పూర్తయినా, మిగిలిన 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి సంగంబండ వద్ద ప్రధాన కాల్వకు అడ్డుగా ఉన్న రాయి. దానిని ఇప్పటికీ తొలగించకపోవడంతో 500 మీటర్ల ప్రధాన కాల్వ పనులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీలు 85 శాతం, పిల్ల కాలువలు 75 శాతంలోపే పూర్తయ్యాయి. దీని కింద 2,03,004 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 1.50 లక్షల ఎకరాలకే ఇస్తున్నారు. దీనిని పూర్తి చేయడానికి మరో 250 ఎకరాలకుపైగా భూమిని సేకరించాల్సి ఉంది. అలాగే, పెండింగులో ఉన్న పునరావాస పనుల గురించి తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోనే లేదు. ఇక, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు విషయంలోనూ అర్ధ సత్యాలే. ఈ ప్రాజెక్టు కింద 42 వేల ఎకరాలకు సాగు నీరివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే.. కాల్వలు, లైనింగ్‌ పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ 32 వేల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేశామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. కానీ, 2004లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2014నాటికే 95 శాతం పూర్తి చేయడం విశేషం. తుపాకులగూడెం (సమ్మక్క, సారక్క బరాజ్‌)ను పూర్తి చేసేశామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందులో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే ఛత్తీస్ గఢ్‌లో ముంపు లేదని ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తేవాలని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. అలాగే, పాలెంవాగు, కుమ్రం భీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథపూర్‌ ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద చేపట్టి సింహాభాగం పూర్తి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టును కూడా ఏఐబీపీ కింద ప్రభుత్వం మంజూరు చేయించుకోలేదు. సరికదా, ఇదివరకే చేపట్టిన ప్రాజెక్టులకు తన వాటాగా నిధులు ఇవ్వలేదు. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చొరవ తీసుకోలేదు.

సొంత డబ్బా

లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరడం లేదు. కేవలం మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అద్భుతమే! అందులో సందేహం లేదు. అయితే, ఏటా వానాకాలంలో 180 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయాలని; తద్వారా, 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని; 18.83 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే, ఎత్తిపోతల విషయంలో 2019 జూన్‌ 21 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా లక్ష్యాన్ని చేరలేదు. 2019లో కేవలం 34 టీఎంసీలను లిఫ్ట్‌ చేశారు. అలాగే, 2020లో 35 టీఎంసీలు; 2021లో 52 టీఎంసీలు; 2022లో కేవలం 5 టీఎంసీలు ఎత్తిపోశారు. జూలై 14న వచ్చిన భారీ వరదలకు కన్నెపల్లి పంపుహౌస్‌ నీట మునగడంతో ఎత్తిపోతలకు బ్రేక్‌ పడింది. దాంతో, 2023లో ఇప్పటి వరకూ 26 టీంఎసీలనే లిఫ్ట్‌ చేశారు. ఐదేళ్లలో కేవలం 152 టీఎంసీల నీటినే ఎత్తిపోశారు. ఇందులో మళ్లీ 50 టీఎంసీలకుపైగా తిరిగి గోదావరిలోకి వదిలేశారు. వెరసి, లక్ష్యం మేరకు ఐదేళ్లలో 900 టీఎంసీలను ఎత్తి పోయాల్సి ఉంటే.. కేవలం 102 టీఎంసీలనే లిఫ్ట్‌ చేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో హెడ్‌ వర్క్‌లు, రిజర్వాయర్లు మాత్రమే పూర్తి కాగా…హెడ్‌ రెగ్యులేటరీలు, కాలువలు/పిల్ల కాలువల పనులు పూర్తి కాలేదు. ఈ ప్రాజె క్టు పరిపూర్ణంగా పూర్తి కావాలంటే మరో 21 వేల ఎకరాల భూములు సేకరించాల్సి ఉంది. అయితే, భూముల విలువలు పెరగడం.. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదు. హెడ్‌ వర్క్‌లు, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ వంటి కీలక రిజర్వాయర్లు పూర్తి చేయించే క్రమంలో భూసేకరణకు సహాయంపై ఉదారంగా స్పందించిన ప్రభుత్వం.. మిగిలిన పనులకు ప్రాధాన్యాన్ని తగ్గించింది. దాంతో, దీని ద్వారా కొత్తగా కేవలం 80వేల ఎకరాల్లోపే ఆయకట్టుకు నీరు ఇచ్చారు. ఫలితంగా, మరో ఐదేళ్లయినా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాల్లేవు. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వేలాది ఎకరాల భూములను భూపాలపల్లి జిల్లా రైతాంగం త్యాగం చేసింది. అయితే, ఈ ప్రాజెక్టుతో ఇక్కడి రైతాంగానికి ఒరిగింది శూన్యమే. జిల్లాలో ఒక్క ఎకరం భూమికీ కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఇక్కడి నుంచి ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలకే అధికంగా కాళేశ్వరం జలాలు అందుతున్నాయి. పరోక్షంగా ఎస్సారెస్పీ ద్వారా మాత్రం భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. దీంతో, పెద్దగా ఆయకట్టు పెరిగింది కూడా ఏమీ లేదు.

శీతకన్ను

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఫలితంగా, ఈ ప్రాజెక్టు న్యాయ వివాదాల్లోకి జారుకుంది. పాలమూరు-రంగారెడ్డి నిర్మాణానికి తొలుత రూ.32,500 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు తాజా అంచనా వ్యయం రూ.52,056 కోట్లకు చేరింది. పూర్తయ్యేలోపు మరో 10-15 వేల కోట్లు పెరుగుతుందని అంచనా. అయితే, దీని నిర్మాణానికి ఇప్పటి వరకూ సమకూర్చింది రూ.18,500 కోట్లు మాత్రమే. అది కూడా కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా. ప్రస్తుత బడ్జెట్‌ (2023-24)లో ఈ ప్రాజెక్టుకు కేటాయింపు రూ.1,187 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. నిధులు ఇవ్వకపోవడంతో పనులు కూడా మందగించాయి. అంతేనా, భూసేకరణ, పునరావాసం పనులకు కలుపుకొని రూ.5 వేల కోట్ల దాకా చెల్లింపులు చేయాల్సి ఉంది. నిర్వాసితుల సమస్యలూ పరిష్కారం కావడం లేదు. శ్రీశైలం ఎడమగట్టు కెనాల్‌ పథకాన్ని (ఎస్‌ఎల్‌బీసీ) ప్రభుత్వం అటకెక్కించింది. గ్రావిటీతో హైదరాబాద్‌కు తాగునీటితోపాటు పూర్వ నల్గొండ జిల్లాలో సాగునీరు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు టన్నెల్‌ పనులు పూర్తి చేయాల్సి ఉండగా… తొమ్మిదేళ్లుగా మూలనపడింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం… సమీక్ష కూడా చేయకపోవడం ఇందుకు కారణం. ఉదాహరణకు, 2005లో శ్రీశైలం నుంచి 43 టీఎంసీల నీటిని తరలించడానికి ఏపీలో వెలిగొండ (పూల సుబ్బయ్య) ప్రాజెక్టు టన్నెల్‌ పనులు ప్రారంభించగా… దానికన్నా ముందే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు ప్రారంభమయ్యాయి. మరో నాలుగు నెలల్లో వెలిగొండ పనులన్నీ పూర్తి కానుండగా.. మరో పదేళ్లయినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తయ్యే పరిస్థితి లేదు. గత ఏడాది చేసిన పనులకు రూ.83.53 కోట్లు; భూసేకరణకు రూ.61.57 కోట్లు.. వెరసి, రూ.147.37 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం వీటిని పక్కనబెట్టింది. ఇక, రాష్ట్రంలో మరో కీలక ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు. అధికారుల తప్పిదాలతో ఇది కష్టాలు ఎదుర్కొంటోంది. తొలుత సీతారామ ఒక ప్రాజెక్టుగా, సీతమ్మసాగర్‌ బ్యారేజీని మరో కాంపోనెంట్‌గా ప్రతిపాదించారు. ఇటీవలే రెండింటినీ కలిపి ఒకే ప్రాజెక్టుగా ప్రతిపాదించిన అధికారులు, తాజాగా మరిన్ని మార్పులు ప్రాజెక్టులో చేశారు. ఇక సీతమ్మ బ్యారేజీ పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో కేసు నడుస్తోంది.

లేని గొప్పలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన కిన్నెరసాని రిజర్వాయర్ విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడుతోంది. అప్పటి కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. కేటీపీఎస్ విద్యుత్ తయారీ సంస్థకు ఈ ప్రాజెక్టు నీరే ఆధారం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ఈ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల ఆధునీకరణకు బడ్జెట్ ఇంతవరకు మంజూరు చేయలేదు. క్షేత్రస్థాయిలో ఇన్ని లోపాలు పెట్టుకొని దశాబ్ది వేడుకల పేరుతో ప్రభుత్వం చేయని పనులను కూడా చేసినట్టు చెప్పుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.