TS Electricity: కోతలు, పవర్ హాలీ డే లు లేవు.. విద్యుత్ విషయంలో సర్కార్ దాస్తున్న నిజాలు ఎన్నో?

ఎత్తిపోతలు సహా ప్రభుత్వ సంస్థల బకాయిలు, సాగుకు 24 గంటల విద్యుత్తు సరఫరా, మీటర్‌ ఆధారంగా విక్రయించే కరెంటు సరఫరా తగ్గిపోవడం.. డిస్కమ్‌ల నష్టాలకు ప్రధానంగా ఇవే కారణాలు.

Written By: Bhaskar, Updated On : October 13, 2023 6:26 pm

TS Electricity

Follow us on

TS Electricity: మన దైనందిన జీవితంలో విద్యుత్ చాలా అవసరం. దాని ఆధారంగానే అన్నీ పనులు సాగుతూ ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విద్యుత్ మీదనే ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాక మానదు. అలాంటి విద్యుత్ సరఫరాకు సంబంధించి ఒకప్పుడు కోతలు ఉండేవి. పవర్ హాలిడేలు ఉండేవి. రాష్ట్ర ఆవిర్భావ రోజు ఉన్న పరిస్థితితో పోలిస్తే.. ఈరోజు తెలంగాణలో అమలవుతున్న విద్యుత్ సరఫరా ను చూస్తే విజయమే అని చెప్పవచ్చు. ఎటువంటి సందేహం కూడా లేదు. ” ఇప్పుడు కరెంట్ పోతే వార్త. తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇది తెలంగాణ సాధించిన విజయం.” ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్న మాట ఇది. వారు చెబుతున్నట్టుగానే విద్యుత్ కోతలు ప్రస్తుతానికి లేవు. కానీ ఈ విద్యుత్ సరఫరా వెనుక అంతులేని విషాదం ఉంది. అంతకుమించి విద్యుత్ సరఫరాకు కీలకమైన డిస్కమ్ ల పుట్టి ముంచే ప్రమాదం పొంచి ఉంది.

అప్పుల కుప్ప

తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న డిస్కములను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసింది.. వరుస నష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చింది. రెప్పవాల్చకుండా కరెంటు సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. వాటికి కేంద్ర బిందువైన విద్యుత్ సంస్థలను మాత్రం దివాలా బాట పట్టించింది. ఎంతలా అంటే.. 2014-15 కాలంలో కేవలం 2,281 కోట్ల నష్టాలతో ఉన్న డిస్కమ్ లు ప్రస్తుతం 45 వేల కోట్లను దాటేశాయి. ఆస్తుల కంటే అప్పుడే ఎక్కువ ఉన్నాయి అనే స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది రేటింగ్, ర్యాంకింగ్స్ జాబితాలో కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది. ఈ ప్రకారం తెలంగాణ డిస్కమ్ లకు ఆస్తుల కన్నా అప్పులే 150 శాతం అధికంగా ఉన్నాయని తెలిపింది. మరో మూడు రాష్ట్రాల్లో డిస్కమ్ ల పరిస్థితి ఇదే విధంగా ఉందని హెచ్చరించింది. డిస్కమ్ లకు మైనస్ “సీ” గ్రేడ్ ర్యాంకు ఇచ్చింది. ఫలితంగా ప్రతినెలా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెలంగాణ విద్యుత్ డిస్కమ్ లు చేరుకున్నాయి.

స్థాపిత సామర్థ్యం పెరగడం లేదు

రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం భారీగా పెరుగుతుండగా.. ప్రభుత్వ రంగంలో స్థాపిత సామర్థ్యం మాత్రం పెరగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించిన థర్మల్‌ విద్యుత్కేంద్రాలు రెండే. అవి కేటీపీఎస్‌ (కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌) ఏడో దశలో 800 మెగావాట్లతో పాటు మణుగూరు ఏడూళ్ల బయ్యారంలో 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌). ఇక, ఉమ్మడి రాష్ట్రంలో భూపాలపల్లిలో 600 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణం చేపట్టగా.. తెలంగాణ ఏర్పడే నాటికే అది 60 శాతం పూర్తయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్లాంట్‌ను పూర్తి చేశారు. ఇలాగే పులిచింతలలో 120 మెగావాట్లు, ప్రియదర్శిని జూరాలలో 234 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాల నిర్మాణాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తయ్యాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ అయిన సింగరేణికి చెందిన 1200 మెగావాట్ల విద్యుత్కేంద్రం నిర్మాణ కసరత్తు/అనుమతుల ప్రక్రియ ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తికాగా.. నిర్మాణంలో కీలక దశలు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తయ్యాయి. ఇక, పూర్వ నల్లగొండ జిల్లా దామరచర్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4,000 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు నిర్మాణంలో ఉంది. దీని నిర్మాణం ఒక అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి చందంగా ఉంది. నాలుగేళ్లలో దీన్ని పూర్తిచేయాలనుకున్నా, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఎన్జీటీ ఈ కేంద్రానికి పర్యావరణ అనుమతిని సస్పెండ్‌ చేసింది. మరోవైపు కేటీపీఎస్‌ ఏడో దశ అనుమతి కోసం 30 ఏళ్లు దాటిన వివిధ దశలకు చెందిన 1020 మెగావాట్ల ప్లాంట్లను మూసేశారు. ఇలా ప్రభుత్వరంగంలో స్థాపిత సామర్థ్యం పెరగకపోగా.. విద్యుత్తు డిమాండ్‌ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా డిమాండ్‌కు తగినట్లుగా పెద్దఎత్తున విద్యుత్తును కొనుగోలు చేస్తుండడంతో విద్యుత్తు సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి.

బకాయిలు ఇవ్వడం లేదు

రాష్ట్రం ఏర్పాటైన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కరెంటు కొనుగోళ్లు రూ.20,908 కోట్లు. కానీ, 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి రూ.36,934 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డిస్కమ్‌లకు వచ్చే ఆదాయమంతా కరెంట్‌ కొనుగోళ్లకే పోతోంది. ఇక ప్రభుత్వ సంస్థల కరెంట్‌ బకాయిలు ఏటికేడు కొండలా పేరుకుపోతున్నాయి. వాటిని ప్రభుత్వం తిరిగి చెల్లించడం లేదు. తెలంగాణ ఆవిర్భవించిన 2014లో నీటిపారుదల (ఎత్తిపోతల) బకాయిలు కేవలం రూ.107 కోట్లు మాత్రమే. కానీ, 2022 (నవంబరు నాటికి)కు వచ్చేసరికి ఇవి కాస్తా రూ.9,268.21 కోట్లకు పెరిగాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ బకాయిలు తొమ్మిదేళ్ల కిందట కేవలం రూ.740 కోట్లు మాత్రమే. ఇప్పుడు అవి రూ.6,353.14 కోట్లకు పెరిగిపోయాయి. ఇలా.. వివిధ ప్రభుత్వ శాఖల బకాయిలన్నీ కలిపి 2014లో కేవలం రూ.1,302 కోట్లు మాత్రమే. కానీ, అవి 2022 డిసెంబరు నాటికి ఏకంగా (తెలంగాణ ఈఆర్సీకి డిస్కమ్‌లు సమర్పించిన లెక్క ప్రకారం) రూ.20,841 కోట్లకు చేరుకున్నాయి. ప్రభుత్వ శాఖల బకాయిలన్నీ ఏకకాలంలో విడుదలైతే డిస్కమ్‌ల నష్టాలు ఏకంగా 40 శాతానికిపైగా తగ్గనున్నాయి. కానీ, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు.

ఇవీ కారణాలు

ఎత్తిపోతలు సహా ప్రభుత్వ సంస్థల బకాయిలు, సాగుకు 24 గంటల విద్యుత్తు సరఫరా, మీటర్‌ ఆధారంగా విక్రయించే కరెంటు సరఫరా తగ్గిపోవడం.. డిస్కమ్‌ల నష్టాలకు ప్రధానంగా ఇవే కారణాలు. విద్యుదుత్పత్తి వ్యయం; పంపిణీ, సరఫరా, వాణిజ్య నష్టాలు పెరగడమూ కారణమే. విద్యుత్తు సంస్థల ఆర్థిక సామర్థ్యానికి మీటర్‌ ఆధారిత విక్రయాలే ప్రాతిపదిక. కానీ, ఇవి రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. తెలంగాణలో రెండు డిస్కమ్‌లు ఉండగా.. వాటిలో దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌- హైదరాబాద్‌)లో మీటర్‌ ఆధారిత విక్రయాలను 2021-22లో 65.81 శాతం (30,794 మిలియన్‌ యూనిట్లు); 2022-23లో 70.06 శాతం(35,942 మిలియన్‌ యూనిట్లు), 2023-24లో 73.48 శాతం (41,762 మిలియన్‌ యూనిట్లు)గా అంచనా వేశారు. ఇక, గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే ఎన్పీడీసీఎల్‌ (వరంగల్‌)లో మీటర్‌ ఆధారిత విక్రయాలు తీసికట్టుగా ఉన్నాయి. 2021-22లో వీటిని 54.69 శాతం (11,222 మిలియన్‌ యూనిట్లు)గా లెక్కించగా 2022-23లో 53.90 శాతం (10,737 మిలియన్‌ యూనిట్లు), 2023-24లో 60.26 శాతం (13,975 మిలియన్‌ యూనిట్లు)గా అంచనా వేశారు. వ్యవసాయ వినియోగాన్ని లెక్కించడానికి మీటర్లు లేకపోవడం, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ, వాటర్‌ బోర్డుల్లో మీటర్లు ఉన్నా రీడింగ్‌ తీయకపోవడమే ఇందుకు కారణం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును దేశవ్యాప్తంగా ప్రభుత్వ పెద్దలు ఘనంగా చెప్పుకొంటున్నారు. కానీ, ఈ కారణంగానే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడం; రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ మేరకు ఆర్థిక సాయం పెరగకపోవడంతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిస్కమ్‌లు విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నాయి. సాగుకు నిరంతర విద్యుత్తు నాలుగేళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఎన్పీడీసీఎల్‌లో వ్యవసాయానికి ఒక యూనిట్‌ కరెంట్‌ అందించడానికి రూ.8.96 ఖర్చవుతోంది. కానీ, సబ్సిడీలు కూడా కలుపుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం రూ.4.44 మాత్రమే. సాగుకు 24 గంటల కరెంట్‌ తర్వాతే డిస్కమ్‌లు దివాలా తీశాయని ఉద్యోగులు మండిపడుతున్నారు. అవసరం లేకున్నా విద్యుత్‌ను సరఫరా చేసి, ఆ మేరకు సబ్సిడీని డిస్కమ్‌లు రాబట్టుకోలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీగా నష్టాలు

ఇక, డిస్కమ్‌లు కూడా 2018-19 నుంచే భారీగా నష్టాలను చవిచూస్తున్నామని చెబుతున్నాయి. 2018 నుంచి గత నాలుగేళ్లలోనే ఏకంగా రూ.22897.74 కోట్ల నష్టాలను మూటగట్టుకోవడాన్ని గుర్తు చేస్తున్నాయి. నష్టాలకు చూపించిన కారణాల్లో ఫీడర్‌ మిక్సింగ్‌, వ్యవసాయేతర, వ్యవసాయ కనెక్షన్లకు ఒకే ఫీడర్లు ఉండడం కూడా కారణమని పేర్కొంటున్నాయి.
దేశవ్యాప్తంగా డిస్కమ్‌ల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్‌ పథకం కారణంగా రాష్ట్ర డిస్కమ్‌లకు కూడా కొంత ఊరట లభించింది. 2015 నాటికి డిస్కమ్‌లు రూ.11,897 కోట్ల అప్పుల్లో ఉండేవి. ఉదయ్‌ పథకంలో భాగంగా వాటిలో 75 శాతాన్ని అంటే, రూ.8,923 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తన మీదికి మళ్లించుకుంది. ఆ తర్వాత క్రమంగా డిస్కమ్‌ల నష్టాల్లో కొంత శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం షరతు విధించడంతో 2017 నుంచి ఇప్పటి వరకూ రూ.13,955కోట్లను డిస్కమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. నష్టాలను ఏయేటికాయేడు తగ్గించుకోవడానికి కేంద్రం పలు సూచనలు చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. దీంతో ఇప్పుడు నష్టాలు ఏకంగా రూ.45 వేల కోట్లను దాటేశాయి. ఇక ప్రస్తుతం డిస్కమ్‌ల అప్పులు రూ.30వేల కోట్లపైనే ఉన్నాయి. వీటిని వ్యాపార విస్తరణ కోసం తీసుకోగా.. రిటర్న్‌ ఆఫ్‌ ఈక్విటీ కింద వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి ఈఆర్‌సీ అనుమతి కూడా ఉంది.