Homeజాతీయ వార్తలుఎడేండ్ల తెలంగాణ రాష్ట్రం!

ఎడేండ్ల తెలంగాణ రాష్ట్రం!

ఎందరెందరి ఉడుకుడుకు పాణాలనో ఉసురుదీసి , విలువైన జీవితాల బలిదానంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈ ఎడేండ్ల కాలం లో ప్రజల ఆశలు, అవసరాలు ఏ మేరకు నెరవేర్చిందో చూడాల్సిన తరుణం ఇది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటమే ఆధిపత్యం, అణిచివేత, పేదరికం, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం , నిధులు, నీళ్ళ, అసమాన పంపిణి ప్రధాన ఎజెండాగా సాగింది.

ఆధిపత్యం:– తెలంగాణ రాష్ట్రాన్ని నేనే సాధించి తెచ్చిన అనే ఒక వ్యక్తిగత పోకడ చూస్తున్నం. 1969 లో 369 మంది అమరుల త్యాగం ఏమైంది? ఏడాది కాలం పాటు విద్యార్థి లోకం విలువైన విద్యాసంవస్తరం కోల్పోవడం, ఉద్యోగుల సమ్మె అంతా వట్టిదేనా? మలి దశ పోరాటం లో తెలంగాణ జనసభ నాయకులులు బెల్లి లలిత, కనకా చారి, ఆకులభూమయ్య లాంటి 17 మంది ప్రాణత్యాగలకు విలువేలేదా? శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిస్టాయ్య, లాంటి వెయ్యిమంది ఆత్మ బలిదానాలు వట్టియేనా? ఉద్యోగుల సమ్మెలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలన్నీ వృథాయేనా ? సకలజనుల సమ్మెలు, సాగరహారాలు, మిలియన్ మార్చి లో మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడిన మాట అవాస్తవమా? ఇందరి ప్రాణత్యాగలు, సమిస్టీ పోరాటాలను స్వంతం చేసుకొని అధికారం లోకి వచ్చిన ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఉన్న ఆధిపత్యానికంటే ఎక్కడ తక్కువ చలాయిస్తున్నది చెప్పండి? ప్రజాస్వామిక వ్యవస్తలో ప్రజావ్యతిరేక పాలకులను మార్చుకోవడం సహజమైన విషయం. కానీ తెలంగాణ ల రాచరిక వ్యవస్థలో రాజులనే దించివేయడానికి సాయుధ పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలది.

అణిచివేత:- చంద్రబాబు, రాజశేకర్ రెడ్డి ల కాలం లో ” తెలంగాణ” అనే మాట కూడా ఉచ్చరించ జాలనంతటి నిర్బంధం అణిచివేత ఉండే. అలాంటి ఒక కటిక చీకటి పాలనను అంతం చేయడాని తెలంగాణ ప్రజలందరిని ఏకతాటి పైకి తేవడానికి కవి గాయకులు, కళాకారులు, మేధావులు, హక్కుల సంఘాలవారు నిరంతరం రాత్రింబవళ్ళు కస్టపడి జనజాతరలు, కాలాజాతలు, ధూంధాం లు, జరిపారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన శ్రీకృష్ణ కమిటీ లాంటి అనేక కమిటీలకు ధీటైన జవాబులు ఇచ్చారు. అలాంటి ప్రశ్నించే వారీనందరిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నోరు మూయించిన వేస్తున్నది నిజం కాదా? విరసం, పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ వంటి 17 సాంఘాలను నిషేధించారే, ఇవన్నీ 2014 వరకు చేసిన పోరాట ఫలితమేగా ఇవ్వాళ ఈ ప్రభుత్వ ఏలుబడికి పునాది రాళ్ళు. వీరినే కాక ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ఆలె నరేందర్ , విజయశాంతి, చెరుకు సుధాకర్ , కోదండరాం నుండి ఇవాల్టి ఈటలరాజేందర్ దాకా అందరినీ అణిచివేస్తున్నది ఏ చరిత్ర కొనసాగింపు?

నిరుద్యోగం: – ఉద్యోగ నియామకాలు చేయకపోవడం ,నియామకాల్లో జరుగుతున్నా జాప్యం, గురించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఈ ఎడేండ్ల కాలం లో ఎన్ని పోరాటాలు చేశారనీ! ఆ పోరాటాలకు కూడా వేదిక లేకుండా ఆఖరుకు ధర్నా చౌక్ నే ఎత్తివేసినంతటి ప్రజాస్వామ్యం ఈ ప్రభుత్వానిది. ఉపాద్యాయులను నియమించకుండా బడులనే మూసి వేసిన గొప్ప పాలన. డాక్టర్లను, నర్సులను చాలినంత మందిని నియమించక పోవడం వలన నే కదా ఈ కరోన కష్ట కాలం లో వేలాదిమంది ఆత్మీయులను కోల్పోయింది. విద్యా, వైద్యం, రెవెన్యూ, జుడిసియరీ , లాంటి అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను పూరించి నిరుద్యోగుల కు న్యాయం చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా?

విద్య :- పాపం జయశంకర్ సార్ మొదటినుండి ప్రాంతీయ అసమానతల విషయం మాట్లాడిన ప్రతిసారి తెలంగాణ ప్రాంతం లో యూనివర్సిటీ స్తాయి నుండి అంగన్ వాడి దాకా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి నెత్తి నోరు కొట్టుకున్నాడు. అవన్నీ పరిష్కరిస్తాం , కే‌జి నుండి పి‌జి వరకు ఉచిత విద్య అన్న నినాదం తో అధికారం లోకి వచ్చి 7 ఏండ్లు అయిపాయేనా? ఏది నీ ఉచిత విద్య? 268 బి‌సి , 171 సోసియల్ వెల్ఫేర్ , 108 ముస్లిం మైనారిటీ, 120నియోజక వర్గానికి ఒకటి చొప్పున, 17 ట్రైబల్, 8 ఏకలవ్య ఇట్లా కులాలుగా మతాలుగా విభజింపబడ్డ కొన్ని ఆవాస విద్యాలయాలు పెట్టి ఓ 5 లక్షల మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తే మిగతా 33 లక్షల మంది బడికి వెళ్లాల్సిన పిల్లలను గాలికి వదిలేసి ప్రైవేట్ పాఠశాల పాలు జేసి కే‌జి నుండి పి‌జి వరకు ఉచిత విద్య అనడం, ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం మోసం కాదా? అందరికీ సమానంగా నాణ్యమైన ఉచిత విద్య అందించాలి.

ఆరోగ్యం : – ప్రతి నియోజక వర్గానికి వంద పడకల హాస్పిటల్, మండలానికో 20 పడకల వైద్యాశాల అంటిరి. కరోన కాలం లో ఎన్ని మరణాలు చూస్తిమి. హాస్పిటల్స్ బిల్డింగ్ కడితే సరిపోదు. సరిపోయినంత మంది సిబ్బంది లేని హాస్పిటల్స్ వృథా కదా? ప్రజావైద్యవిధానం కావాలి. అందరికీ సమాంగంగా నాణ్యమైన ఉచిత వైద్యం అందివ్వాలి.ఎడేండ్ల తర్వాత ఏడు వైద్య కళాశాలలకు శంకుస్తాపనట, అందులో ముఖ్య మంత్రి వాగ్దానం చేసిన కరీంనగర్ ఊసే లేదు. వాటి ఫలితాలు వచ్చేదెన్నడు?

నిధులు:- ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కె లక్ష కోట్ల నిదులు ఇచ్చి విద్య, వైద్యం లాంటి కీలక రంగాలను గాలికి వదిలి పెడితే ఎలా? మంత్రులు ఎమ్మెల్లెలకు నెలకు లక్షలాది వేతనాలు తీసుకుంటూ ఉద్యోగులకు కనీసం పి‌ఆర్‌సి కూడా ఇవ్వక పోవడం ఏమి న్యాయం. ఉపాధి అవకాశాలు లేక దినసరి కూలీలు దిక్కు లేని బతుకులు బతుకుతుంటే ఫామ్ హౌస్ లో కనీసం మంత్రులకు కూడా కలిసే అవకాశంఇవ్వకుండా, ఉన్న సెక్రెటరేట్ కూల్చివేసి వేల కోట్ల ఖర్చుతో కొత్తది కట్టడం, లక్షలాది కోట్ల అప్పులు ప్రజల నెత్తిన రుద్దడం ఏమి పాలన? ఐదేకరాలు ఉంటే కోటి రూపాయల ఆస్తి. కోటి రూపాయల ఆస్తిపరులకు సాలీనా 50 వేల రూపాయాల చొప్పున, ఎంత భూముంటే అన్నీ వేలు పప్పుబెల్లాల వలె ప్రజాధనాన్ని ఎలా పంచుతావు? టెంపరరీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసవేతనాలు ఎందుకివ్వరు. రైతు నెల సారి ఆదాయం 6500\-. రైతులకు మద్దతు ధర మాత్రమే ఎందుకు? గిట్టుబాటు ధరలు ఎందుకు చెల్లించరు? హరిత హారం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లక్షలాది మొక్కలు నాటుతున్నారు.అడవులు అరణ్యాలున్న గుట్టలను ధ్వంసం చేస్తున్నారు. ఇదేమి అభివృధ్ధి? .

నీళ్ళు:- కాళేశ్వరం నుండి మల్లన్నసాగర్ కు నీళ్ళు వెళ్తాయి కానీ ఒడ్డున్నే ఉన్న మంథని నియోజకవర్గం లో నీళ్ళు ఇవ్వరు. బోర్లు వేసినా నీళ్ళు పడని పాత మేదక్ జిల్లా పరిస్తితి ఎందుకుంది?
ఏమీ మారెను ఏమి మారెను రా ఏడెండ్లా లోనా?
గతము కంటే ఘనమే మున్నదిరా ఈ పాలనలోనా?
అడిగేటోల్లా నోరూ మూసి అడుగుబట్టా తోక్కూ తుండ్రు.
రాచరికపూ పోకటోలే రాజ్య పాలన సాగుతోంది.

– వీరగొని పెంటయ్య .
రాష్ట్ర ఉపాధ్యక్షులు ,రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ. కరీంనగర్.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular