
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ సర్కార్ బీసీల కోసం కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. 2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో 5,200 కోట్లను ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల ద్వారా అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీలు), బీసీల్లోని మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలని భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆపద్బంధు పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తోంది. బీసీ మహిళలకు ఆర్థిక సాధికారత చేకూర్చడానికి కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అధునాతన పరికరాలను ఇవ్వనుంది. కొన్ని కులాల వారికి వృత్తిపనిముట్లను ఇవ్వనున్న ప్రభుత్వం కొన్ని కులాల వారికి
మాత్రం వాహనాలను సమకూర్చనుంది.
ఏప్రిల్ నెల 27వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభం కానుందని సమాచారం. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ కు సంబంధించి అతి త్వరలో విధివిధానాలను ఖరారు చేయనుంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ స్కీమ్ ప్రారంభమవుతూ ఉండటం గమనార్హం. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎంపిక చేసిన ఎంబీసీ యువకులకు ఆంబులెన్స్ లను అందజేయనుంది.
ఒక్కో ఆంబులెన్స్ ధర రూ.26 లక్షలు కాగా గ్రూపు సభ్యులు 10 నుంచి 15 శాతం డబ్బులను మార్జిన్ కింద చెల్లించాల్సి ఉంటుంది. యూనిట్ ధరలో 85 శాతం కంటే ఎక్కువ మొత్తం ప్రభుత్వం సబ్సిడీ కింద భరిస్తుండటం గమనార్హం.