
భారత్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో 80,000కు పైగా నమోదవుతున్న కరోనా కొత్త కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర రాష్ట్రంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. అయితే మహారాష్ట్ర సర్కార్ చేసిన ఈ ప్రకటనపై ఠానే కు చెందిన హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ విధించడం వల్ల వ్యాపారం దెబ్బ తింటుందని ఠానే కు చెందిన హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం అభిప్రాయపడింది.
లాక్ డౌన్ వల్ల గతేడాది భారీగా నష్టపోయామని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తే తీవ్రంగా నష్టపోతామని ఠానే కు చెందిన హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం తెలిపింది. మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఠానే జిల్లాలో మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం తీసుకున్న నిర్ణయం మద్యం ప్రియులకు ఝలక్ అనే చెప్పాలి.
హోటళ్ల వ్యాపారుల సంఘం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా డొంబ్లివి, కళ్యాణ్, నవీ ముంబై ప్రాంతాలలో కూడా మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన చేయడం గమనార్హం.