తెలంగాణ రాష్ట్రంలో మరో రికార్డు తిరగరాసింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్లలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. దీనిని ధృవీకరిస్తూ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ‘దేశానికి ఆదర్శంగా నిలిచిన మన మిషన్ భగీరథ’ అంటూ ఒక పిక్ పోస్టు చేశారు.
Also Read: సారూ… నోరిప్పండి!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తాగునీటికి అధిక ప్రాధాన్యమిచ్చారు. సురక్షితమైన మంచినీటిని ప్రతీ ఇంటికి అందించాలని లక్ష్యంతో ప్రధాన నరేంద్ర మోదీ చేతుల మీదుగా మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారు. ఇందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. కేసీఆర్ మానస పుత్రికగా మిషన్ భగరథ పథకం పేరుగాంచింది. ఈ పథకం ద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలువడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో 54.34లక్షల ఇళ్ళు ఉండగా 53.46లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఉందని పేర్కొంది. 98.31శాతం ఇళ్ళకు నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోయిందని ప్రకటించింది. వీటి ద్వారా ప్రభుత్వం నీటి సరఫరా చేస్తోందని పేర్కొంది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవని ప్రకటించడం గమనార్హం.
Also Read: కాంగ్రెస్ దెబ్బ.. డిఫెన్స్ లో టీఆర్ఎస్, ఎంఐఎం
తెలంగాణ తర్వాత నల్లాల ద్వారా నీటి సరఫరా చేస్తున్న గోవా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 89.05 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మూడో స్థానంలో పుదుచ్చేరి 87.02, నాలుగో స్థానంలో హర్యానా 79.78, ఐదో స్థానంలో గుజరాత్ 74.16శాతంతో నిలిచింది. చివరి స్థానంలో పశ్చిమబెంగాల్ 2.05 శాతంతో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో 95.66లక్షల ఇళ్ళు ఉండగా 33.21శాతం నివాసాలకు నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని అందిస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.